ఐపీఎల్ 2026లో జోరు పెంచిన బెట్టింగ్ రాజాలు
ఏపీలో రూ.5 వేల కోట్ల మేర దందా
దేశంలో రూ.1.25 లక్షల కోట్ల మేర బెట్టింగ్ దందా సాగనుందని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ అంచనా
మాఫియా కమీషనే రూ.27,500 కోట్లు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఐపీఎల్ సీజన్ క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపుతుంటే.. ఇదే సమయంలో బెట్టింగ్ భూతం వీరవిహారం చేస్తోంది. ఈ ఏడాది మార్చి 28న మొదలైన ఐపీఎల్ 2026 సీజన్ మే 31తో ముగియనుంది. దేశంలోని 13 వేదికల్లో నిర్వహించనున్న 74 క్రికెట్ మ్యాచుల ద్వారా భారీ స్థాయిలో బెట్టింగ్‌కు తెరలేచింది. ఇందుకోసం బెట్టింగ్ మాఫియా పకడ్బందీగా రంగంలోకి దిగింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో దేశంలో రూ.1.25 లక్షల కోట్ల బెట్టింగ్ దందా సాగనుందని ‘డిజిటల్ ఇండియా ఫౌండేషన్’ అంచనా వేయడం గమనార్హం. కాగా ఏపీలో కూడా బెట్టింగ్ మాఫియా చెలరేగిపోతోంది. అధికార కూటమి నేతలే రింగ్ మాస్టర్లు అవతారం ఎత్తి బెట్టింగ్ దందాకు పాల్పడుతున్నారు. రూ.5 వేల కోట్లకు పైగా దందా సాగించి కమీషన్ రూపంలోనే రూ.1,250 కోట్లు వరకు కొల్లగొట్టేందుకు పకడ్బందీగా సన్నద్ధమయ్యారు.
చోద్యం చూస్తున్న పోలీసు శాఖ..
అధికార కూటమి నేతల అండతో బెట్టింగ్ సాగుతుండడంతో పోలీసు శాఖ చోద్యం చూస్తుండిపోవాల్సి వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వ్యాపారస్తుల దగ్గర నుంచి మెకానిక్‌లు, హోటళ్లలో పనిచేసుకునే వారు, చిన్నాచితకా పనులు చేసుకునే వారి వరకు కూడా బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. విద్యార్థులు సైతం బెట్టింగ్ మహమ్మరి బారిన పడుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ కోసం కాల్ మనీ రాకెట్ నుంచి అధిక వడ్డీలకు అప్పులు చేసి.. డబ్బు పోగొట్టుకుని.. వాటిని తీర్చే దారి లేక ఆస్తులు అమ్ముకుంటున్న వారు, తీవ్ర అవమానాలు, ఇబ్బందులు పడుతున్నవారు ఎందరో. చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
నిర్వాహకుల కమీషనే రూ.27,500 కోట్లు
ఆటలో బాల్ బాల్‌కు డబ్బు అన్నట్లు బెట్టింగ్ మాఫియా ఆకర్షిస్తోంది. ఐపీఎల్‌లో బెట్టింగ్‌లో డబ్బులు సంపాదించిన వారి దాఖలాలు చాలా తక్కువ. కాకపోతే బెట్టింగ్ నిర్వాహకులు మాత్రం భారీగా కమీషన్ రూపంలో రాబట్టుకుంటున్నారు. ఐపీఎల్–2025 సీజన్‌లో బెట్టింగ్ మాఫియా కమీషన్ రూపంలోనే రూ.25 వేల కోట్లు కొల్లగొట్టినట్టు డిజిటల్ ఇండియా సంస్థ పేర్కొంది. ప్రస్తుత సీజన్‌లో అది రూ.27,500 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.
విస్మయం కలిగిస్తున్న గణాంకాలు..
దేశంలో క్రికెట్ బెట్టింగుల్లో పాల్గొంటున్న వారి గణాంకాలు మరింత విస్మయం కలిగిస్తున్నాయి. ఐపీఎల్ 2025లో 34 కోట్ల మంది బెట్టింగ్‌లో పాల్గొన్నారని ఇండియా ఛేంజ్ ఫోరం అనే సంస్థ వెల్లడించింది. గత ఏడాది ఐపీఎల్‌లో మూడు నెలల కాలంలో ప్రధాన బెట్టింగ్ యాప్‌లకు ఏకంగా 160 కోట్ల విజిట్స్ రావడం గమనార్హం. ఐపీఎల్ సీజన్‌లోనే బెట్టింగ్‌లో పాల్గొంటున్న వారి సంఖ్య ఏటా 15 శాతం మేర పెరుగుతోందని కూడా పేర్కొంది. ఆ ప్రకారం ఐపీఎల్ 2026 సీజన్‌లో 40 కోట్ల మంది వరకు బెట్టింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం దాదాపు 4 వేల బెట్టింగ్ యాప్‌లను బ్లాక్ చేసింది. అయినా 5 వేలకు పైగా ప్రస్తుతం యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఆల్‌టైం హైకి బెట్టింగ్ దందా!
ఐపీఎల్–2026 సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో డిజిటల్ ఇండియా ఫౌండేషన్ నివేదిక ప్రకారం దేశంలో బెట్టింగ్ దందా ఏటా 30 శాతం చొప్పున పెరుగుతోంది. ఐపీఎల్ 2025లో దేశంలో రూ.లక్ష కోట్ల మేర బెట్టింగ్ దందా సాగిందని ఆ సంస్థ నివేదిక వెల్లడించింది. తాజాగా మొదలైన ఐపీఎల్ 2026 సీజన్‌లో ఏకంగా రూ.1.25 లక్షల కోట్ల మేర బెట్టింగ్ సాగుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం జరుగుతున్న 19వ సీజన్ ఐపీఎల్‌లో బెట్టింగ్ దందా ‘ఆల్‌టైమ్ హై’కి చేరుతుందని కూడా అంచనా వేసింది. ఇదంతా కూడా అక్రమ దందాయేనని స్పష్టం చేసింది.
కార్యాలయాలు తెరిచి మరీ బెట్టింగ్
ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగ్ మాఫియా మరింత విస్తరిస్తోంది. అధికార టీడీపీ కూటమి నేతలే రింగ్ మాస్టర్ల అవతారమెత్తారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో వారి ప్రధాన అనుచరులే ప్రత్యేకంగా కార్యాలయాలు తెరిచి మరీ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఓ ప్రజాప్రతినిధి కుటుంబం బెట్టింగ్ నిర్వహణకు రాజరాజేశ్వరిపేట, అజిత్‌సింగ్‌నగర్‌లో ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేశారు.
అలాగే భీమవరం, కాకినాడ, దెందులూరు, ఏలూరులో బెట్టింగ్ అనేది బహిరంగ రహస్యంగా మారింది. విశాఖలో మద్యం సిండికేట్ నిర్వహిస్తున్న ఓ టీడీపీ ప్రజాప్రతినిధికి చెందిన బార్లు బెట్టింగ్ దందాకు వేదికలుగా మారాయి. మ్యాచ్‌లో టాస్ ఎవరు గెలుస్తారనే దగ్గర మొదలు నుంచి.. బంతి బంతికి బెట్టింగ్ కాస్తున్నారు. ఒక్కో పందెం రూ.500 నుంచి ఏకంగా రూ.10వేల వరకు ఉంటోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రాష్ట్రంలో రూ.5వేల కోట్ల మేర బెట్టింగ్ దందా సాగుతుందని అంచనా. అందులో బెట్టింగ్ నిర్వాహకులు కమీషన్ రూపంలో రూ.1,250 కోట్లు కొల్లగొడతారని భావిస్తున్నారు.


