నా చావుతోనైనా చిరుద్యోగులకు న్యాయం జరగాలి | Electricity Department Contract Employee Attempts Suicide in Amalapuram | Sakshi
Sakshi News home page

నా చావుతోనైనా చిరుద్యోగులకు న్యాయం జరగాలి

Apr 12 2026 5:30 AM | Updated on Apr 12 2026 5:30 AM

Electricity Department Contract Employee Attempts Suicide in Amalapuram

కొత్తపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బండారు ప్రశాంత్‌కుమార్‌ (ఇన్‌సెట్‌లో) సెల్ఫీ వీడియో మాట్లాడుతూనే పురుగుమందు తాగుతున్న ప్రశాంత్‌ కుమార్‌

పురుగు మందు తాగి సెల్ఫీ వీడియో విడుదల చేసిన విద్యుత్‌ శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగి 

సమాన పనికి సమాన వేతనం కల్పించాలంటూ చంద్రబాబు, పవన్, లోకేశ్‌కు వినతి 

అమలాపురంలో విద్యుత్‌శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

రావులపాలెం: ‘‘చాలీచాలని జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాలాంటి ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం జీతాలు పెంచి న్యాయం చేయాలి. నాకు ఇటీవలే వివాహమైంది.. నాకు ఒక అన్న, చెల్లెలు ఉన్నారు. నా కుటుంబాన్ని ఆదుకోండి. నా చావుతోనైనా మాలాంటి చిన్నపాటి ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి’’ అంటూ విద్యుత్‌ శాఖలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో షిఫ్ట్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఓ యువకుడు ఆత్మహత్యకు యతి్నంచాడు.  వివరాలు ఇలా.. కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన బండారు ప్రశాంత్‌ కుమార్‌ రావులపాలెం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. 

ఎప్పటిలాగే శనివారం ఉదయం డ్యూటీ ముగించుకుని అమలాపురానికి తిరిగి వెళ్లే సమయంలో వాడపాలెం లాకుల వద్ద ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఒక సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో పెట్టి పురుగు మందు తాగాడు. అంతకుముందు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో కూడా తాను చనిపోతానని, తన చావుతోనైనా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, లోకేశ్‌ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరాడు. వీడియో చూసిన సహచరులు, బంధువులు వెంటనే ప్రశాంత్‌ కోసం గాలించగా కొత్తపేట మండలం వాడపాలెం లాకుల వద్ద అపస్మారక స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రావులపాలెంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement