గ్రామాల్లో టీడీపీ నేతలకు ఉపాధి నిధులను దోచిపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం
2014–19 మధ్య జరిగిన పనులకు అంటూ రూ.331.66 కోట్లు చెల్లింపులు
ఎమ్మెల్యేల తమ్ముళ్లు, బంధువులు, టీడీపీ నేతల పేరిట ఇష్టారాజ్యంగా బిల్లులు
మంత్రివర్గంలో ఆమోదం తెలిపి మరీ దోపిడీ
అప్పట్లో గ్రామ పంచాయతీల ఆధ్యర్యంలో పనులు
బిల్లులు మాత్రం ఇప్పుడు వెండార్ల పేరుతో ఉన్న టీడీపీ నేతలకు..
అధికారుల పేరుతోనూ బిల్లులు పెట్టి నిధులు స్వాహా
కేంద్రానికి లేఖ రాసి మరీ క్లోజ్ చేసిన రికార్డులను తెరిపించిన వైనం
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో 2017–19 మధ్య వందకు పైగా పండ్ల తోటల పెంపకం పనుల పేరిట 2025 ఆగస్టులో ఆ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తమ్ముడు ధర్మవరపు మురళి ఒక్కరే లక్షల రూపాయలకు బిల్లులు పెట్టుకొని ఉపాధి హామీ పథకం నుంచి నిధులు దండుకు న్నారు. బండమీదపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో 60 పనులకు రూ.7,28,276, చెర్లోపల్లెలో 18 పనులకు రూ.2,64,909, మండల కేంద్రమైన రాప్తాడులో 17 పనులకు రూ.1,20,807, హంసాపురంలో 21 పనులకు రూ.83,847.. ఇలా పలు గ్రామాల్లో పనులకు ఆయన పేరిట బిల్లుల చెల్లింపు కూడా పూర్తయింది. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలు.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ నేతలు ‘ఉపాధి’ని అడ్డుపెట్టుకుని రూ.వందల కోట్లలో దోపిడీ పర్వాన్ని యథేచ్ఛగా కొనసాగించారు. కూలీలతో చేయించే పనులే కాకుండా, రోడ్ల నిర్మాణం తదితర మెటీరియల్ కేటగిరీ పనుల్లో సైతం కాంట్రాక్టర్ల వ్యవస్థకు ఈ పథకంలో తావుండదు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో లేదా వివిధ ప్రభుత్వ విభాగాల ప్రత్యేక పర్యవేక్షణలో ఆ పనులు చేపట్టాల్సి ఉంటుంది. అయితే 2014–19 మధ్య జరిగిన మొత్తం 4,47,344 పనులకు సంబంధించి రూ.331.66 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలని చంద్రబాబు కూటమి ప్రభుత్వం 2024 నవంబర్ 6న మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు అదే నెల 15న ఆదేశాలు జారీ చేసింది. వాటికి సంబంధించి 2025 ఆగస్టులో దాదాపు రూ.300 కోట్ల దాకా చెల్లింపులు పూర్తయ్యాయి. అప్పట్లో వివిధ గ్రామ పంచాయతీల పేరుతో జరిగిన పనులకు సంబంధించి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి టీడీపీ నాయకులు పలువురు పెద్ద సంఖ్యలో నేరుగా ‘వెండార్’ పేరిట బిల్లులు పెట్టుకొని డబ్బులు దండుకున్నారు. కొన్ని చోట్ల ఎంపీడీవోలు లేదా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేసి టీడీపీ నేతలు సొమ్ము చేసుకున్నారు. ఇలా వందల కోట్ల రూపాయలు డ్రా చేసుకున్నారు.
90 శాతం వెండార్లకు జీఎస్టీనే లేదు
2014–19 మధ్య కాలానికి ఉపాధి హామీ పథకం నిధుల చెల్లింపులకు ఉన్న నిబంధనల్లో 2021 తర్వాత మార్పులు చోటు చేసుకున్నాయి. మారిన నిబంధనల ప్రకారం ఈ పథకంలో ఏ పనికి సంబంధించిన బిల్లులైనా నేరుగా ఆ పనికి అవసరమైన వస్తువులు సరఫరా చేసే వెండార్ (సరఫరాదారుడు లేదా వ్యాపారి)కు లేదంటే పని చేసే కూలీలకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆ పనుల బిల్లుల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం వెండార్ల పేర్లు, బ్యాంకు అకౌంట్ల వివరాలను మాత్రమే నమోదు చేయాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో పాత బకాయిల పేరిట వందల కోట్ల రూపాయలు టీడీపీ నేతలకు దోచిపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం గ్రామాల్లో టీడీపీ నేతలకు వెండార్ల ముసుగు వేసింది. ఆయా టీడీపీ నేతల పేర్లనే సిమెంట్ తదితర వస్తువులు సరఫరా చేసే, సేవలు అందించే వ్యాపారవేత్తలంటూ నమోదు చేయించింది. ఈ పథకం కింద వెండర్ల పేర్లను నమోదు చేసే అధికారం మండలాల్లో ఎంపీడీవోలకే ఉండటంతో అధికార పార్టీ పెద్దలు ఇష్టమొచ్చినట్టు వ్యవహరించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులకు వివిధ రకాల వస్తువులు, సామగ్రి తదితర వస్తువులు సరఫరా చేసే వెండార్లుగా దాదాపు 14 లక్షల మంది పేర్లు నమోదయ్యాయి. ఇందులో ఏకంగా 13.94 లక్షల మంది వెండార్లకు కనీసం జీఎస్టీ నంబరు కూడా లేదని అధికార గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ లెక్కన దోపిడీ ఎలా సాగిందో ఇట్టే స్పష్టమవుతోంది.
మూసిన రికార్డులు తెరిపించి మరీ బిల్లులు
ఉపాధి పనుల మంజూరు, పురోగతి, బిల్లుల నమోదు, చెల్లింపుల ప్రక్రియ అంతా ఆన్‌లైన్ విధానంలో కొనసాగుతుంది. 2014–19 మధ్య జరిగిన పనులకు బిల్లుల చెల్లింపులు జరిగి ఆ పనుల నిర్వహణ అన్ని దశల్లో పూర్తయినట్టు కేంద్రం వెబ్‌సైట్‌లో సైతం నమోదు చేసింది. అయినప్పటికీ బకాయిల పేరిట టీడీపీ నేతలకు నిధులను దోచి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు లేఖ రాసి పనుల రికార్డులను తిరిగి ఓపెన్ చేయించింది.


