కాకాణిపై ఆగని కక్షసాధింపు | YSRCP Kakani Expresses Outrage on Chandrababu Govt: AP | Sakshi
Sakshi News home page

కాకాణిపై ఆగని కక్షసాధింపు

Apr 12 2026 5:21 AM | Updated on Apr 12 2026 5:21 AM

YSRCP Kakani Expresses Outrage on Chandrababu Govt: AP

రెండ్రోజుల వ్యవధిలో రెండు కేసులు నమోదు  

ప్రభుత్వ వైఫల్యాలను ప్ర శ్నించినా.. పచ్చ మీడియాను విమర్శించినా అక్రమ కేసులు 

ఇప్పటికే అనేక అక్రమ కేసులతో 86 రోజులపాటు జైలుపాలు 

పోలీసులపై ఒత్తిడి తెచ్చి వేధింపులు

సాక్షి ప్రతినిధి నెల్లూరు:  మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు ఆగడంలేదు. టీడీపీ కూటమి వైఫల్యాలను నిలదీసినా, వారి అనుకూల మీడియాను విమర్శించినా సహించేదిలేదన్నట్లుగా అక్రమ కేసులు బనాయిస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్రజ్యోతి మురికిరాతలపై నిరసన వ్యక్తంచేసిన కాకాణిపై వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో రెండ్రోజుల వ్యవధిలో రెండు అక్రమ కేసులు నమోదయ్యాయి.  

ప్రభుత్వ పెద్దల అసహనం.. 
చంద్రబాబు సర్కారు వైఫల్యాలు, అసమర్థత, ప్రజా వ్యతిరేక విధానాలను కాకాణి నిత్యం ప్రశ్నిస్తుండడాన్ని ప్రభుత్వ పెద్దలు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే అనేక అక్రమ కేసులు నమోదుచేసి 86 రోజుల పాటు జైల్లో నిర్బంధించి పైశాచికానందాన్ని పొందారు. అయితే కాకాణి జైలు నుంచి బయటకొచి్చనప్పటి నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుండడంతో జీర్ణించుకోలేని కూటమి నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి అక్రమ కేసులతో వేధింపులు కొనసాగిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న దు్రష్పచారంలో నిజమే గెలిచిందని.. అసత్య ప్రచారాలు, అర్థరహిత ఆరోపణలన్నీ అబద్ధాలని సీబీఐ నివేదిక ద్వారా తేటతెల్లమైందంటూ వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి మాగుంట లేఅవుట్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో కాకాణి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో..  

కులమతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా కాకాణి వ్యాఖ్యలు చేశారంటూ దర్గామిట్ట పోలీసులకు టీడీపీ నేత ఒకరు తప్పుడు ఫిర్యాదు చేశారు.    
 అలాగే.. కోవూరు మండలంలో బాలిక మృతిచెందిన ఘటనలో బాధిత కుటుంబానికి అండగా నిలిచి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారు. ఫలితంగా ఆయనపై కోవూరు పోలీసులు మరో కేసు నమోదు చేశారు.  

 హైదరాబాద్‌లోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిరసన తెలిపినందుకు అక్కడి పోలీసులూ కేసు నమోదుచేశారు.  
 తాజాగా.. వేదాయపాళెం పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. మరోవైపు.. కాకాణి కుటుంబ సభ్యులపైనా ప్రభుత్వ పెద్దలు కక్షసాధింపు చర్యలకు ఒడిగట్టారు. కోవూరు మండలంలో బాలిక మృతి విషయమై ఎక్స్‌ వేదికగా కాకాణి పూజిత స్పందించారు. మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలు, పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టడంతో తట్టుకోలేకపోయారు. అంతే.. కోవూరు పోలీసులపై ఒత్తిడి తెచ్చి నోటీసులు పంపారు. ఇప్పుడు ఏబీఎన్‌ దుర్మార్గ రాతలను నిరసిస్తూ చేపట్టిన నిరసనలో పాల్గొన్న ఆమెపైనా వేదాయపాళెం పోలీసులు నాన్‌ బెయిలబుల్‌ కేసును నమోదు చేశారు. 

ఈనెల 8న నెల్లూరు ఆంధ్రజ్యోతి ఎడిషన్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలో నిరసన వ్యక్తంచేసిన కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై మర్నాడే ఆ పత్రికా సిబ్బంది ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. తాజాగా పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడితో ఓ ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదుచేయడం గమనార్హం. అయితే, నిరసనలో వైఎస్సార్‌సీపీ నేతలు తమను తాకరాని చోట తాకారంటూ ఫిర్యాదు ఇవ్వాలని మహిళా పోలీసులపై ఒత్తిడి చేసినా.. అందుకు తాము సిద్ధంగాలేమని వారు ఖరాఖండిగా చెప్పినట్లు తెలిసింది. మిగతా పోలీసు సిబ్బంది సైతం ఇందుకు వెనక్కి తగ్గినా.. వేదాయపాళెం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌తో బలవంతంగా ఫిర్యాదు చేయించి కేసు నమోదుచేసినట్లు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement