ఖాకీ ముసుగేసుకున్న కీచకుడు | ASI Blackmail Love Couples Incident In Palnadu District: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఖాకీ ముసుగేసుకున్న కీచకుడు

Apr 12 2026 5:39 AM | Updated on Apr 12 2026 5:39 AM

ASI Blackmail Love Couples Incident In Palnadu District: Andhra pradesh

సంచలనంగా మాచర్ల టౌన్‌ ఏఎస్‌ఐ వ్యవహారం 

ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటల వీడియోలు తీసి బెదిరింపులు.. లైంగిక వేధింపులు 

వ్యభిచార గృహాల నిర్వాహకులను బెదిరించి వసూళ్లు 

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఏఎస్‌ఐ వీడియోలు 

దుర్మార్గాలకు పాల్పడుతున్న మరికొందరు పోలీసులు 

మాచర్ల ఏఎస్‌ఐ శ్రీనివాసరావు సస్పెన్షన్‌

సాక్షి, నరసరావుపేట: మహిళలకు అండగా నిలవాల్సిన రక్షకభటులే వారి పాలిట కీచకులుగా మారిన ఉదంతం రాష్ట్ర ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఏకాంతంగా ఉండే జంటల వీడియోలు తీసి.. వారిని బెదిరించి నగదు గుంజుకోవడంతోపాటు లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డబ్బులు తీసుకుని పరువు హత్యకు కారణమైన సీఐ వెంకటరమణ వ్యవహారం మరువక ముందే మాచర్లలో మరో ప్రబుద్ధుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. టౌన్‌ పోలీసుస్టేషన్‌ ఏఎస్‌ఐగా పనిచేస్తున్న శ్రీనివాసరావు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు గస్తీ పేరుతో పర్యాటక, నిర్మానుష్య ప్రాంతాల్లో తిరుగుతుంటారు. ఏకాంతంగా గడపటానికి వచ్చిన ప్రేమజంటలతోపాటు భార్యాభర్తల వీడియోలు తీసి వారిని బెదిరిస్తుంటాడు.

‘స్టేషన్‌కు పదండి’ అని గద్దిస్తూ బాధితులను భయపెట్టి నగదు గుంజుకునే ప్రయత్నం చేస్తాడు. అతడి మాటల్ని ఖాతరు చేయని వారి వీడియోలు వైరల్‌ చేస్తానని బెదిరించి వారినుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసి జేబులు నింపుకుంటున్నాడు. కొందరు మహిళలను లైంగికంగా కూడా వేధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాగిన మత్తులో ఏఎస్‌ఐ శ్రీనివాసరావు అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించిన వీడియోలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఓ నవజంట సరదాగా రోడ్డు పక్కన బండిమీద కూర్చుని మాట్లాడుతుండగా ఏఎస్‌ఐ వారిని బెదిరించిన తీరును చూస్తుంటే అతడు ఎంతటి దుర్మార్గుడో అర్థమవుతోంది. 

ఆటోడ్రైవర్‌ సాయంతో.. 
ఏఎస్‌ఐ శ్రీనివాసరావు ప్రేమ జంటల వీడియోలు తీసి, ఆ తరువాత విచారణ పేరుతో వారి నుంచి డబ్బు గుంజేవాడు. యువతులకు ఫోన్‌చేసి తన కోరిక తీర్చకపోతే వీడియోలు బయటపెడతానని బెదిరించి పలువురి మహిళలను ఇబ్బందులకు గురిచేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాల్లో వీడియోలు తీయడానికి, డబ్బులు వసూలు చేయడానికి మాచర్ల మండలం జమ్మలమడకకు చెందిన ఆటో డ్రైవర్‌ సైదులును సహాయకుడిగా నియమించుకున్నాడు. ఏఎస్‌ఐ చేసిన దుర్మార్గాలను సైతం ఆటో డ్రైవర్‌ వీడియోలు తీయడంతో ఈ వ్యవహారం బయటపడింది.

నిత్యం రాత్రివేళ ఆటోలో కానిస్టేబుళ్లు, హోంగార్డులతో ఏఎస్‌ఐ హైవేలపై సంచరించేవాడు. ఎవరు కనిపించినా బెదిరించి దౌర్జన్యం చేసేవాడు. అతిగా మద్యం సేవించడమే కాకుండా వాహనాలు ఆపి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు రాస్తానని డబ్బులు గుంజేవాడు. వ్యభిచార గృహాలపై దాడులు చేసి వారినుంచి డబ్బులు వసూలు చేయడంతోపాటు అక్కడి మహిళలపైనా లైంగికంగా వేధింపులకు దిగాడు. 

పోక్సో కేసు ఉన్నా పోస్టింగ్‌లోనే.. 
గతంలోనూ ఏఎస్‌ఐ శ్రీనివాసరావుపై లైంగిక ఆరోపణలున్నాయి. ఇప్పటికే అతనిపై మేడికొండూరు పోలీసుస్టేషన్‌లో పోక్సో కేసు నమోదు కాగా.. వాయిదాల నిమిత్తం కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. అయిఆ అధికారులు అతనికి పోస్టింగ్‌ ఇచ్చారు. అయినప్పటికీ ప్రవర్తన మార్చుకోకుండా స్టేషన్‌కు వచ్చే బా«ధిత మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడని తోటి ఉద్యోగులు చెబుతున్నారు.

ఫిర్యాదుదారులకు ఫోన్లుచేసి సమస్య పరిష్కరిస్తానని.. తన కోరిక తీర్చాలని వేధింపులకు గురిచేసేవాడని బా«ధిత మహిళల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. అయితే, చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఏఎస్‌ఐ ఆగడాలు పెచ్చుమీరాయి. ఎక్కడ పనిచేస్తే అక్కడ మహిళలతో వివాహేతర సంబంధాలు నెరపడం ఏఎస్‌ఐ అలవాటుగా మార్చుకున్నాడు. ఇతనిపై గతంలో భార్య సైతం ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 

సస్పెన్షన్‌ వేటు 
కాగా.. మాచర్ల టౌన్‌ ఏఎస్‌ఐ శ్రీనివాసరావు వీడియోలు శనివారం సోషల్‌ మీడియాలో వైరలై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసుశాఖ స్పందించింది. ఏఎస్‌ఐ శ్రీనివాసరావుపై గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సస్పెన్షన్‌  వేటు వేశారు. అతనిపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. మరోవైపు ఏఎస్‌ఐతో పాటు ఇదే స్టేషన్‌లో పనిచేసే మరో అధికారి, మరికొందరు సిబ్బంది సైతం ఇదే తరహా వ్యవహారాలు చేస్తున్నారని, వారిపైనా విచారణ జరపాలని మాచర్ల వాసులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement