ఇది పుచ్చుకో.. అది ఇచ్చుకో!.. రాజధాని పనుల్లో క్విడ్ ప్రో కో | Another Dimension in Amaravati Construction Scams: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఇది పుచ్చుకో.. అది ఇచ్చుకో!.. రాజధాని పనుల్లో క్విడ్ ప్రో కో

Apr 12 2026 5:11 AM | Updated on Apr 12 2026 5:11 AM

Another Dimension in Amaravati Construction Scams: Andhra Pradesh

సచివాలయంలో జీఏడీ టవర్‌ పనులు భీమా ఇన్‌ఫ్రాకు అప్పగింత

శామీర్‌పేట 6,205 చ.మీ. విస్తీర్ణంలో హెరిటేజ్‌ ఐస్‌క్రీమ్‌ ప్లాంట్‌ నిర్మించిన భీమా ఇన్‌ఫ్రా

‘నీకిది.. నాకిది’ ఒప్పందంలో భాగంగానే నిర్మించారంటున్న ఇంజినీరింగ్‌ నిపుణులు

జీఏడీ టవర్‌ పనులను రూ.882.47 కోట్లకు టెండర్‌ ద్వారా ఎన్‌సీసీకి అప్పగింత

జీఎస్టీ, సీనరేజీ, న్యాక్‌ వంటి పన్నుల రూపంలో రూ.163.60 కోట్లు రీయింబర్స్‌

అంటే.. టవర్‌ కాంట్రాక్టు పనుల విలువ రూ.1,046.07 కోట్లు

వాటిని తామే చేస్తున్నట్టు భీమా ఇన్‌ఫ్రా సొల్యూషన్స్‌ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడి

2018లో ఇదే పనులు రూ.554.06 కోట్లకు ఎన్‌సీసీకి కట్టబెట్టిన వైనం

ఇప్పుడూ టెండర్‌లో అదే సంస్థ చేతికి జీఏడీ టవర్‌ పనులు

నాటికీ నేటికీ అంచనా వ్యయం రూ.524.91 కోట్లు పెంపు

తద్వారా కాంట్రాక్టు సంస్థకు భారీ ప్రయోజనం 

ప్రతిఫలంగానే హెరిటేజ్‌ ఐస్‌క్రీమ్‌ ప్లాంట్‌ నిర్మాణం

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి కాంట్రాక్టు పనుల్లో మరో కోణం వెలుగుచూసింది. శాశ్వత సచివాలయంలో భాగంగా నిర్మిస్తున్న జీఏడీ టవర్‌ పనులను టెండర్లలో ఎన్‌సీసీ సంస్థ దక్కించుకుంది. కానీ.. ఆ టవర్‌ను డయాగ్రిడ్‌ స్ట్రక్చరల్‌ స్టీల్‌ విధానంలో తామే నిర్మిస్తున్నట్టు భీమా ఇన్‌ఫ్రా సొల్యూషన్స్‌ సంస్థ వెల్లడించింది. టెండర్‌ నిబంధనల ప్రకారం 50 శాతం పనులను సీఆర్‌డీఏ అనుమతి తీసుకుని అధికారికంగా సబ్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించవచ్చు. జీఏడీ టవర్‌ నిర్మాణంలో డిజైన్, స్ట్రక్చరల్‌ కనెక్షన్‌ ఇంజినీరింగ్, ప్రిసిసిన్‌ స్టీల్‌ ఫ్యాబ్రికేషన్, డయాగ్రిడ్‌ స్ట్రక్చరల్‌ పద్ధతిలో నిర్మించే పనులను తాము చేస్తున్నట్లు భీమా సంస్థ పేర్కొంది.

అయితే.. ఇదే సంస్థ హైదరాబాద్‌కు సమీపంలో శామీర్‌పేట వద్ద సీఎం చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్‌ ఫుడ్స్‌కు 6,205 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రీ–ఇంజినీర్డ్‌ బిల్డింగ్‌(పీఈబీ) విధానంలో ఐస్‌క్రీమ్‌ ప్లాంట్‌ కోసం భవనాన్ని నిర్మించినట్టు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ‘నీకిది.. నాకిది’లో భాగంగానే హెరిటేజ్‌ పుడ్స్‌కు ఐస్‌క్రీమ్‌ ఫ్యాక్టరీ ప్లాంట్‌ను సీహెచ్‌ సీతారాం మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న భీమా సంస్థ నిర్మించిందనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

హెరిటేజ్‌కు ఐస్‌క్రీమ్‌ ప్లాంట్‌ను నిర్మించిన భీమా
టెండర్లలో అధికారికంగా పనులు దక్కించుకున్న ఎన్‌సీసీ సంస్థకు వాటిని అప్పగించడానికి గతేడాది జూన్‌ 26న ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్‌ నిబంధనల ప్రకారం సీఆర్‌డీఏ ఈఎన్‌సీ, సీఈలకు సమాచారం ఇచ్చి.. వారినుంచి అధికారిక అనుమతి తీసుకున్నాక 50 శాతం పనులను సబ్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించవచ్చు. జీఏడీ టవర్‌ నిర్మాణ పనుల్లో భీమా సంస్థకు ఎంత పరిమాణంలో సబ్‌ కాంట్రాక్టు కింద అప్పగించామన్నది ఎన్‌సీసీ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. సీఆర్‌డీఏ ఈఎన్‌సీ, సీఈలు కూడా వెల్లడించలేదు.

కానీ.. భీమా ఇన్‌ఫ్రా సొల్యూషన్స్‌ సంస్థ మాత్రం తన అధికారిక వెబ్‌సైట్‌లో ఆ పనులు చేస్తున్నట్టు పేర్కొనడం గమనార్హం. ఇదే సంస్థ సీఎం చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్‌ ఫుడ్స్‌కు హైదరాబాద్‌కు సమీపంలోని శామీర్‌పేట్‌ వద్ద 98.5 మీటర్ల పొడవు, 63 మీటర్ల వెడల్పు, 18.2 మీటర్ల ఎత్తుతో పీఈబీ విధానంలో ఐస్‌క్రీమ్‌ ప్లాంట్‌ కోసం భవనాన్ని నిర్మించినట్టు భీమా ఇన్‌ఫ్రా సొల్యూషన్స్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఆ ప్లాంట్‌ను ఇటీవల సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి ప్రారంభించారు.

నాడూ నేడూ ఒకే సంస్థ.. అంచనా వ్యయం భారీగా పెంపు
ముఖ్యమంత్రి, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో 1,04,815 చదరపు మీటర్ల నిర్మిత ప్రాంతంతో చేపట్టే పనులకు 2018లో నిర్వహించిన టెండర్లలో రూ.554.06 కోట్లకు ఎన్‌సీసీ సంస్థ దక్కించుకుంది. 2019 నాటికే రూ.32.90 కోట్ల విలువైన పనిని ఆ సంస్థ పూర్తి చేసిందని కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) 2023లో ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అంటే.. జీఏడీ టవర్‌లో మిగిలిన పనుల విలువ రూ.521.16 కోట్లు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ కాంట్రాక్టును రద్దు చేసింది. ఆ పనుల కాంట్రాక్ట్‌ విలువ రూ.884.22 కోట్లుగా నిర్ణయించి.. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్‌ వంటి పన్నుల రూపంలో 163.60 కోట్లను రీయింబర్స్‌ చేస్తామని పేర్కొంటూ గతేడాది టెండర్లు పిలిచింది.

ఈ పనులను 4.53 శాతం అధిక ధర అంటే రూ.882.47 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచి ఎన్‌సీసీ సంస్థే తిరిగి దక్కించుకుంది. దానికి పన్నులు కలిపితే.. జీఏడీ టవర్‌ కాంట్రాక్టు విలువ రూ.1,046.07 కోట్లకు చేరుతుంది. అంటే.. నాటికీ నేటీకీ అంచనా వ్యయం రూ.524.91 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. అప్పుడూ ఇప్పుడూ ఒకే సంస్థ టెండర్‌లో పనులు దక్కించుకోవడాన్ని బట్టి చూస్తే గూడుపుఠాణీ కాకపోతే మరేమిటని ఇంజినీరింగ్‌ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దీనిద్వారా కాంట్రాక్టర్‌కు భారీఎత్తున ప్రయోజనం చేకూర్చారని ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇవే అంశాలను వైఎస్సార్‌సీపీ ‘ఎక్స్‌’లో  పోస్ట్‌ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement