రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఇదే హాట్ టాపిక్
వైఎస్ జగన్ ప్రతిపాదనకు రోజురోజుకూ పెరుగుతున్న ప్రజామద్దతు
మావిగన్ వల్ల ప్రయోజనాలను స్పష్టంగా వివరించిన జగన్
పోర్టు, ఎయిర్‌పోర్టు, హైవేలు, రెండు రైల్వే జంక్షన్లు ఉన్న మావిగన్.. 4 కార్పొరేషన్లు, రెండు మున్సిపాల్టీలున్న ప్రాంతం
తక్కువ ఖర్చుతోనే, తక్కువ సమయంలోనే గ్రోత్ ఇంజన్‌లా మావిగన్
ఇప్పటికే ఈ ప్రాంతంలో ముమ్మరంగా వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు
ఇలాంటి ప్రాంతానికే రాజధానిగా త్వరగా అభివృద్ధి అయ్యే అవకాశాలు
అందుకే అమరావతి వద్దు.. మావిగన్ ముద్దు అంటున్న రాష్ట్ర ప్రజానీకం.. అమరావతి అసాధ్యమని తెలిసీ చంద్రబాబు రాజధాని లేకుండా చేస్తున్నారంటున్న జనం
రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, తాగునీటికి రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?
ఇక ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు మరింత ఖర్చు
ఇవన్నీ పూర్తి కావడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఆ ఫలాలు అందేదెన్నడు?
ఆచరణ సాధ్యం కాని అమరావతి వైపు పరుగులెందుకు?.. అన్ని వర్గాలలోనూ ఇదే చర్చ
దాంతో మావిగన్‌పై ప్రజల దృష్టిని మరల్చేందుకు బాబు డైవర్షన్ రాజకీయాలు
ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు.. వందిమాగధుల పిచ్చి ప్రేలాపనలు
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ ఆలోచననుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం చంద్రబాబు అండ్ కో ఎన్ని డైవర్షన్ కుట్రలు చేసినా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు అదే చర్చ నడుస్తోంది. ఆచరణ సాధ్యం కాని అమరావతి గురించి, మావిగన్ ప్రయోజనాల గురించి జనం బేరీజు వేసుకుంటున్నారు. ప్రజా రాజధానిగా అభివృద్ధి చేసుకునేందుకు మావిగన్ అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతమని వ్యాఖ్యానిస్తున్నారు. మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు పట్టణాలను కలిపి మహానగరంలా మార్చుకునేందుకు, మంచి రాజధానిగా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశముందని అంటున్నారు.. తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతోనే ఇది సాధ్యమవుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. మావిగన్‌తో వచ్చే అవకాశాలు, ఉద్యోగాల గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. 10 రోజులుగా రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ దీనిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. మావిగన్‌తో వచ్చే ప్రయోజనాల గురించి స్పష్టంగా వివరించిన వైఎస్ జగన్ అమరావతిపై అనేక ప్రశ్నలనూ సంధించారు. జగన్ అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదన చేశారని జనం అంటున్నారు. మావిగన్‌కు ప్రజల నుంచి రోజురోజుకూ మద్దతు పెరుగుతుండడంతో సీఎం చంద్రబాబు కంటికి కునుకు కరువయ్యింది. ఎల్లో మీడియా సహకారంతో, మందీ మార్బలం ప్రోద్బలంతో మావిగన్ నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎల్లో మీడియాలో మరణ మృదంగం కథనాలు వస్తున్నాయి. వైఎస్ మరణానికి జగనే కారణమనే దిగజారుడు రాతలకు ఎల్లో పత్రికలు దిగజారాయి. 

చంద్రబాబు ఉసిగొల్పడంతోనే ఆయన మెప్పుకోసం చుట్టూ ఉన్న వందిమాగధ బృందాలు గార్దభాల్లా గొంతు విప్పుకుని ఓండ్రపెడుతున్నాయి. అసలు నరహంతక చరిత్ర చంద్రబాబుదే కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్, వంగవీటి రంగా, చివరకు పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్, తమ్ముడు రామ్మూర్తినాయుడి వరకు ఏ మరణాన్ని చూసినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చంద్రబాబువైపే వేళ్లన్నీ చూపిస్తాయన్న సంగతి తెల్సిందే.. అవేవీ ప్రజలకు తెలియవన్నట్లుగా ఉంది ఈ ఎల్లో సిండికేట్ వీరంగం చూస్తుంటే.. మావిగన్ అంటే వీళ్లెంత భయపడుతున్నారో ఈ డైవర్షన్ రాజకీయాలను చూస్తుంటేనే అర్థం చేసుకోవచ్చు.
మొదట మావిగన్ అంటే జోక్ అన్నారు.. ప్రజల్లో మద్దతు పెరుగుతుండడంతో ఆ తర్వాత అది సీఆర్‌డీఏ పరిధిలోనే ఉంది అంటున్నారు.. ఎవరేమన్నా ప్రజలు మాత్రం మావిగన్ ప్రజా రాజధాని అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. అమరావతి ప్రచారం వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవన్న విషయం అందరికీ అర్థమవుతోంది.. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రతిపాదించిన ఆచరణాత్మకమైన మావిగన్.. చంద్రబాబు ఆచరణసాధ్యం కాని ఊహాజనితమైన అమరావతిని పోల్చుకుంటూ రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తొలి రోజు నుంచే పరుగులు
ఇప్పటికే అన్ని మౌలికవసతులు ఉండి 110 కి.మీ జాతీయ రహదారులు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి–తాడేపల్లి వంటి నాలుగు కార్పొరేషన్లతో పాటు ఉయ్యూరు, తాడిగడప వంటి మరో రెండు మున్సిపాల్టీలు కలిగి ఉన్న మావిగన్ ప్రాంతానికి రాజధానిగా తొలి రోజునుంచే పరుగులు పెట్టే శక్తి ఉందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 60 లక్షలకుపైగా జనాభా ఉండటం, వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతుండడం వల్ల ఈ ప్రాంతం వేగవంతమైన గ్రోత్ ఇంజన్‌గా పనిచేస్తుందని మేధావులు విశ్లేషిస్తున్నారు.
అదే అమరావతి రాజధాని అయితే జనాభా లేని ఈ ప్రాంతంలో విద్యుత్ లైన్లు, రహదారులు, మురికి కాలవలు దగ్గర నుంచి కొత్తగా నిర్మించుకోవాల్సి వస్తుందని, లక్ష ఎకరాల్లో వీటి నిర్మాణం పూర్తి చేయడానికి చాలా సుదీర్ఘ సమయం పడుతుందంటున్నారు. మావిగన్‌లో అన్ని మౌలికవసతులు ఉండటంలో తొలిరోజు నుంచే రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అదే అమరావతి విషయానికి వస్తే ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదంటున్నారు. ఆచరణసాధ్యం కాని అమరావతి పేరుతో చంద్రబాబు రాష్ట్రానికి అసలు రాజధానే లేకుండా చేస్తున్నాడని విమర్శకులంటున్నారు.
అమరావతికి ఎన్ని లక్షల కోట్లు అవసరమవుతాయో?
అమరావతిలో రోడ్లు వేయడానికి, కరెంట్ ఇవ్వడానికి, డ్రైనేజీ వ్యవస్థ, నీళ్లు వంటి బేసిక్ వసతులు కల్పించడానికి ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు ప్రభుత్వమే సెంట్రల్ గవర్నమెంట్‌కు, బ్యాంకులకు ఇచ్చిన డీపీఆర్‌లలో స్పష్టంగా పేర్కొంది. ఈ లెక్కన చూసుకుంటే తొలి దశలో 50 వేల ఎకరాలకే లక్ష కోట్లు, ఇప్పుడు రెండో దశ కింద సేకరిస్తున్న మరో 50 వేల ఎకరాలు కలుపుకుంటే మొత్తం లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు కేవలం రోడ్లు వేయడం, కరెంట్, డ్రైనేజీ పనులకే అవసరం అవుతాయి.
వీటన్నింటినీ పూర్తి చేయడానికి చాలా దశాబ్దాలు పట్టే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇప్పుడు ఉన్న రూ. 2లక్షల కోట్ల అంచనా వ్యయం విలువ ఏళ్లు గడిచేకొద్దీ రూ.4 లక్షల కోట్లు అవుతుందో, రూ. 10 లక్షల కోట్లు అవుతుందో తెలియదు. అదే మావిగన్‌లో అయితే ఇందులో కేవలం పదోవంతు అంటే సుమారు రూ.20,000 కోట్లు ఖర్చు చేస్తే చాలు ప్రభుత్వ భవనాలు, ఇతర నిర్మాణాలు పూర్తి చేసుకుని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలతో పోటీ పడగలమని నిపుణులంటున్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ కాదని, రానున్న కాలంలో రాష్ట్రానికి ఆర్థిక గుదిబండగా తయారయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
అందుబాటులో అన్ని మౌలిక వసతులు
మావిగన్ పూర్తిగా జాతీయ రహదారులు, రైల్వేలైన్లతో అనుసంధానించి ఉండటం వేగంగా వృద్ధి చెందడానికి ప్రధానంగా కలిసివచ్చే అంశం. 110 కి.మీ పైగా ఆరులైన్ల జాతీయ రహదారులు ఉండటమే కాకుండా, దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించే విజయవాడలోని అతిపెద్ద రైల్వే జంక్షన్‌తో పాటు గుంటూరు రైల్వే జంక్షన్ ఉన్నాయి. అదే అమరావతి పూర్తిగా ఒక మారుమూల ప్రాంతంగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని ప్రధాన రహదారులకు అనుసంధానించడానికి ప్రత్యేకంగా రహదారులు, రైల్వే లైన్లు నిర్మించాలి. ఇందుకోసం వేల కోట్లు వ్యయం చేయాల్సి రావడం లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రానికి పెద్ద గుదిబండగా మారుతుందని ఆర్థిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. పోర్టు, ఎయిర్‌పోర్టు, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు వంటి అన్ని కీలక మౌలికవసతులు మావిగన్‌లో ఉండటంతో ఎటువంటి అదనపు వ్యయాలు లేకుండా తొలి రోజు నుంచే పెద్ద నగరాలతో పోటీపడ వచ్చంటున్నారు.
పోర్టు నగరాల్లో శరవేగంగా అభివృద్ధి
చెన్నై సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం.. ముంబైకి సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం వల్లే భారీ ఎత్తున పెట్టుబడులు తరలిరావడంతో ఆ నగరాలు స్వల్ప కాలంలోనే మహానగరాలుగా రూపాంతరం చెందాయని.. వాటితరహాలోనే మావిగన్ కూడా మహానగరంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు రాజధాని ప్రాంతానికి మచిలీపట్నం పోర్టును అనుసంధానిస్తే లాజిస్టిక్స్ వ్యయం తగ్గడమే కాకుండా ఇది ఎగుమతులు దిగుమతులతో ప్రధాన ఆర్థిక వాణిజ్య కేంద్రంగా వేగంగా ఎదుగుతుందంటున్నారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సాగరమాల పథకం కింద మచిలీపట్నం పోర్టును జాతీయ రహదారులు, రైల్వేలైన్లతో అనుసంధానించే విధంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది.. నౌకాశ్రయం, విమానాశ్రయం సమీపంలోనే ఉండటం వల్ల ఎగుమతులు, దిగుమతులకు అత్యంత అనువైన ప్రాంతం ఇది. ఐటీ వంటి స్మార్ట్ ఇండస్ట్రీస్‌తోపాటు భారీ ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పట్టణాలు అత్యంత అనుకూలమైనవని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్‌ను రాజధానిగా ప్రకటించి.. అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి పోటీలుపడటం ఖాయమంటున్నారు. అదే అమరావతి విషయానికి వస్తే మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి 5,000 ఎకరాలు కేటాయించడంతోపాటు వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు.


