భారత మహిళల జట్టుకు తొలి వన్డే వరల్డ్‌కప్ టైటిల్‌ను అందించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ను ఘనంగా సత్కరించేందుకు పంజాబ్ ప్రభుత్వం సిద్దమైంది. వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో పంజాబ్ రాష్ట్రం నుంచి హర్మన్‌తో పాటు హర్లీన్ డియోల్, అమన్‌జోత్ కౌర్ ఉన్నారు.
వీరి ముగ్గరికి తలా రూ.1.5 కోట్లు చొప్పున నగదు బహుమతి ఇవ్వాలని భగవంత్ మాన్ సర్కార్ నిర్ణయించున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ సర్కార్ త్వరలోనే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
హర్మన్‌కు నో ప్రమోషన్
ప్రస్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) ఉన్న హర్మన్‌ను ఎస్పీగా ప్రమోట్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ సర్వీస్ నిబంధనల ప్రకారం ఎస్పీగా పదోన్నతి పొందాలంటే ఆమె కనీసం 12 నుంచి 15 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలి. ఈ క్రమంలోనే హర్మన్ ప్రమోషన్‌కు బదులగా క్యాష్ ప్రైజ్ అందుకోనుంది. కాగా 2017 వన్డే ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత హర్మన్‌ను పంజాబ్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో సత్కరించింది.
కానీ ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన చౌదరి చరణ్ యూనివర్సిటీ యూజీసీ గుర్తింపు లేకపోవడంతో వివాదస్పదమైంది. దీంతో హర్మన్‌ను డీఎస్పీ నుండి కానిస్టేబుల్‌గా డిమోట్ చేశారు. అయితే ఆ తర్వాత ఆమె లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా తన డిగ్రీని పూర్తి చేసి తిరిగి డీఎస్పీగా నియమించబడింది. అయితే భారత విజయంలో కీలక పాత్ర పోషించిన హర్లీన్ డియోల్, అమన్‌జోత్ కౌర్‌లకు ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశముంది.
చదవండి: ఓడినా.. గెలిచినా ఒకటే పాట? ఇదెక్కడి న్యాయం?: భారత మాజీ కెప్టెన్


