
టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar)లో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు గెలిస్తే.. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ తొలిసారి విజయబావుటా ఎగురవేసింది.
అయితే, లార్డ్స్‌లో ఆఖరి వరకు పోరాడిన గిల్ సేనకు చేదు అనుభవమే మిగిలింది. దీంతో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. మాంచెస్టర్‌లోనూ తొలిసారి గెలిచి సిరీస్‌ను సమం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్
ఇక ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కామెంటేటర్ వ్యవహరిస్తున్న టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా ఆసక్తికర ఎంపికతో ముందుకు వచ్చాడు. ఇరుజట్ల నుంచి 21వ శతాబ్దానికి గానూ తన అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు.
దిగ్గజాలకు నో ప్లేస్
అయితే, ఇందులో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)తో పాటు గౌతం గంభీర్, మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మలకు మాత్రం పుజ్జీ చోటివ్వలేదు.
అదే విధంగా.. ఇంగ్లండ్ లెజెండరీ ఆటగాళ్లు సర్ అలిస్టర్ కుక్, జేమ్స్ ఆండర్సన్ (James Anderson)లను కూడా పుజారా పట్టించుకోలేదు. ఇక తన కంబైన్డ్ జట్టుకు ఓపెనర్లుగా అలెక్ స్టెవార్ట్, రాహుల్ ద్రవిడ్‌లను ఎంచుకున్న పుజారా.. వన్‌డౌన్‌లో జో రూట్‌ను ఆడిస్తానని తెలిపాడు.
భారత్ నుంచి ఏడుగురు
మరోవైపు.. మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లిని ఎంపిక చేసుకున్న ఈ వెటరన్ బ్యాటర్.. ఐదో స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను ఎంపిక చేసుకున్నాడు.
అదే విధంగా.. బౌలింగ్ విభాగంలోనూ టీమిండియా ఆటగాళ్లకే పుజారా పెద్ద పీట వేశాడు. పేస్ దళంలో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలకు చోటిచ్చిన పుజారా.. స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లకు స్థానం కల్పించాడు.
ఇంగ్లండ్ నుంచి ఇద్దరు సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఆండ్రూ ఫ్లింటాఫ్, బెన్ స్టోక్స్‌లను పుజారా ఎంపిక చేశాడు. మొత్తంగా టీమిండియా- ఇంగ్లండ్ 21వ శతాబ్దపు అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లకు మాత్రమే పుజారా చోటివ్వడం విశేషం. పన్నెండో ఆటగాడిగా మాథ్యూ హోగర్డ్‌ను పుజ్జీ ఎంచుకున్నాడు.
ఎదురుచూపులే మిగిలాయి
కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 103 టెస్టులు ఆడిన పుజారా 7195 పరుగులు సాధించాడు. ఇందులో 19 శతకాలు, 3 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐదు వన్డేల్లో కలిపి 51 పరుగులు మాత్రమే చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఐపీఎల్‌లో 30 మ్యాచ్‌లలో కలిపి 390 రన్స్ చేశాడు.
చివరగా ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్ ఆడిన పుజారా.. టీమిండియాలో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే, యువ ఆటగాళ్లతో పోటీలో అతడు పూర్తిగా వెనుకబడ్డాడు.
పుజారా ఎంచుకున్న 21వ శతాబ్దపు భారత్- ఇంగ్లండ్ కంబైన్డ్ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్
అలెస్ స్టెవార్ట్ (వికెట్ కీపర్), రాహుల్ ద్రవిడ్, జో రూట్, విరాట్ కోహ్లి, వీవీఎస్ లక్ష్మణ్, బెన్ స్టోక్స్, ఆండ్రూ ఫ్లింటాఫ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మాథ్యూ హొగర్డ్ (12th man).
చదవండి: ODI WC 2011: యువీని సెలక్ట్ చేయడం అవసరమా?.. ధోని నిర్ణయం ఇదే..