
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ ఈ ఏడాది ఆగస్టు 29 నుంచి ప్రారంభం కానుంది. ఇటీవల పీకేఎల్ వేలం ముగియగా... అన్ని ఫ్రాంచైజీలు జట్లను సిద్ధం చేసుకున్నాయి. త్వరలోనే వేదికలతో పాటు సీజన్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
‘12 ఫ్రాంచైజీలు వేలంలో తమ తమ జట్లను బలోపేతం చేసుకున్నాయి. 12వ సీజన్ కోసం అన్నీ జట్లు సమాయత్తమవుతున్నాయి. గతం కంటే మరింత రసవత్తరంగా మ్యాచ్‌లు జరగడం ఖాయం’ అని నిర్వాహకులు వెల్లడించారు. మే 31, జూన్ 1న ముంబై వేదికగా పీకేఎల్ వేలం పాట జరగగా... రికార్డు స్థాయిలో 10 మంది ఆటగాళ్లు కోటి రూపాయాల కంటే ఎక్కువ ధర దక్కించుకున్నారు.
వచ్చే నెల ఆఖరులో ప్రారంభం కానున్న పీకేఎల్‌లో హర్యానా స్టీలర్స్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఇక గత సీజన్‌లో 22 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్... 12 విజయాలు, 10 పరాజయాలతో పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది.