
ఆటగాళ్లకు ఇకపై విరామాలు ఉండవు
బీసీసీఐలో కొత్త చర్చ
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఒక కీలక అంశం భారత క్రికెట్‌లో చర్చకు వచ్చింది. గత కొంత కాలంగా బీసీసీఐ ప్రధాన ఆటగాళ్లకు ‘పనిభారం’ ఎక్కువగా ఉంటుందని, వారికి మ్యాచ్‌లు, సిరీస్‌ల మధ్యలో తగినంత ‘విశ్రాంతి’ ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలో టాప్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో సిరీస్‌తో మూడు టెస్టులే ఆడతాడని టీమ్ మేనేజ్‌మెంట్ ముందే ప్రకటించింది. చివరకు అదే జరిగింది. అయితే తొలి టెస్టు తర్వాత వారం రోజుల విరామం వచ్చినా బుమ్రా రెండో టెస్టు ఆడకపోవడం, కీలకమైన, సిరీస్‌ను సమం చేయాల్సిన చివరి టెస్టుకు కూడా అతను దూరం కావడం తీవ్ర చర్చకు దారి తీసింది.
మరోవైపు ఎలాంటి విరామం లేకుండా పూర్తి ఫిట్‌నెస్‌తో మొహమ్మద్ సిరాజ్ ఐదు టెస్టులూ ఆడి వేయికి పైగా బంతులు వేయడం ఈ అంశాన్ని మరింతగా చర్చించేందుకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఇకపై ‘పనిభారం’ పేరుతో ఆటగాళ్లు మ్యాచ్‌లకు దూరం కాకుండా నిబంధనలు విధించాలని బోర్డు యోచిస్తోంది. దీంతో పాటు కొందరు క్రికెటర్లు ప్రత్యేక హోదాను ప్రదర్శిస్తూ తమకు నచ్చిన మ్యాచ్‌లు ఎంచుకుంటూ మిగతా కొన్ని మ్యాచ్‌ల నుంచి వేర్వేరు కారణాలతో తప్పుకుంటున్నారు. దీనికి కూడా ఫుల్‌స్టాప్ పెట్టే ప్రతిపాదన ఉందని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
‘సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లందరికీ ఈ సమాచారం అందిస్తాం. ముఖ్యంగా మూడు ఫార్మాట్‌లలో రెగ్యులర్‌గా ఆడే ప్లేయర్లు ఇకపై తమ ఇష్టానుసారం మ్యాచ్‌లను ఎంపిక చేసుకునే వీలుండదు’ అని ఆయన అన్నారు. ‘పనిభారం’ అంటూ ఆటగాళ్లను మ్యాచ్‌లకు దూరం పెట్టే విషయంపై కూడా సరైన రీతిలో చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ‘పేస్ బౌలర్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందనేది వాస్తవం. ఈ విషయంలో వైద్యబృందం సలహాలతోనే ముందుకు వెళతాం. అయితే పనిభారం పేరుతో కీలక మ్యాచ్‌లకు దూరం కావడం మాత్రం జరగదు. ఆటకంటే ఆటగాళ్లు ఎక్కువ కాదని సందేశం అందరికీ వెళ్లాలి’ అని ఆయన పేర్కొన్నారు.
దేశం కోసం ఆడుతున్నప్పుడు...
మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ కూడా ‘పనిభారం’ విషయంలో ఘాటుగా స్పందించారు. ‘దేశం కోసం ఆడుతున్నప్పుడు గాయం, నొప్పిలాంటివాటిని మర్చిపోవాలి. సరిహద్దుల్లో చలి ఎక్కువగా ఉందని సైనికులు ఫిర్యాదు చేస్తున్నారా. పంత్ ఫ్రాక్చర్‌తో ఆడేందుకు సిద్ధమయ్యాడు. అలాంటి తత్వం ఆటగాళ్ళలో ఉండాలి. కోట్లాది మంది భారతీయులకు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
సిరాజ్ ఐదు టెస్టుల్లోనూ కెప్టెన్ అడిగిన ప్రతీసారి 7–8 ఓవర్ల స్పెల్‌లు బౌలింగ్ చేశాడు. అసలు ‘పనిభారం’ అనే చర్చనే అతను తీసిపడేశాడు. నేను చాలా కాలంగా చెబుతున్నా. ఈ పదాన్ని భారత క్రికెట్ డిక్షనరీ నుంచి పూర్తిగా తొలగించాలి’ అని గావస్కర్ అభిప్రాయపడ్డారు.
సిరీస్ విజయంతో స్వదేశానికి...
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ఓవల్‌లో చివరి టెస్టు ముగిసిన తర్వాత భారత క్రికెటర్లు ప్రత్యేకంగా ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. సుదీర్ఘ సిరీస్ ముగిసిన వెంటనే జట్టును వీడేందుకు సిద్ధమయ్యారు. కొందరు విశ్రాంతి కోసం ఇంగ్లండ్‌లోనే ఆగిపోయేందుకు సిద్ధపడగా...మరికొందరు సాధ్యమైనంత తొందరగా అందుబాటులో ఉన్న ఫ్లయిట్ ద్వారా స్వస్థలాలకు తిరిగి వచ్చారు. మ్యాచ్ ముగిశాక లండన్ వీధుల్లో సహచరుడు కుల్దీప్‌తో కలిసి సరదాగా తిరిగిన అనంతరం అర్ష్ దీప్ స్వదేశానికి బయల్దేరాడు. అతనితో పాటు సిరాజ్, శార్దుల్ కూడా భారత్‌కు చేరుకున్నారు.
ఇంకా మెరుగు కావాలి: గంభీర్
భారత జట్టులో కొత్త ఆటగాళ్లు రావడం, కొందరు జట్టుకు దూరం కావడం సాధారణంగా జరిగే ప్రక్రియే అని, ఎవరు ఉన్నా జట్టు ప్రతీసారి ఆట మరింత మెరుగు పడటం ముఖ్యమని హెడ్ కోచ్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇది జట్టు సంస్కృతిలో భాగం కావాలని అతను సూచించాడు. ఓవల్‌లో విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్ ఆటగాళ్లతో ప్రత్యేకంగా మాట్లాడాడు.
‘సిరీస్ 2–2తో ముగియడం చాలా గొప్ప ఫలితం. అందరికీ నా అభినందనలు. అయితే మనం మెరుగుపడేందుకు ఇంకా అవకాశం ఉంటుంది. దాని కోసం మరింత కష్టపడుతూనే ఉండాలి. అలా చేస్తే సుదీర్ఘ కాలం టీమిండియా ప్రపంచ క్రికెట్‌ను శాసించగలదు. ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. డ్రెస్సింగ్‌రూమ్‌లో సంస్కృతి ఎలా ఉండాలంటే అందరూ ఇందులో భాగం కావాలని కోరుకోవాలి. ఇదే మనం చేయాల్సిన పని’ అని గంభీర్ మార్గనిర్దేశనం చేశాడు.
ఈ సందర్భంగా ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అనే ప్రత్యేక అవార్డును జడేజా చేతుల మీదుగా వాషింగ్టన్ సుందర్ అందుకున్నాడు. ‘ఇంగ్లండ్‌లో వరుసగా నాలుగు టెస్టులు ఆడే అవకాశం రావడం నా అదృష్టం. ఇక్కడ బాగా ఆడాలని ఎంతో కోరుకున్నాను. ప్రతీ రోజు మన జట్టు ఆడిన తీరు చాలా గొప్పగా అనిపించింది’ అని సుందర్ వ్యాఖ్యానించాడు.