ఆనందంలో పరాగ్వే ఆటగాళ్లు , మొరాకో ఆటగాళ్ల సంబరం
‘పెనాల్టీ షూటౌట్’లో తడబాటు
ప్రిక్వార్టర్స్‌లోకి పరాగ్వే, మొరాకో
అత్యంత నిలకడగా రాణించే జట్టుగా పేరున్న జర్మనీ... ప్రపంచకప్‌లో మూడుసార్లు రన్నరప్‌గా నిలిచిన నెదర్లాండ్స్... ఈసారి నిరాశపరిచాయి. కీలకదశలో ఒత్తిడికి తలొగ్గిన జర్మనీ, నెదర్లాండ్స్ నాకౌట్ దశ తొలి రౌండ్ మ్యాచ్‌లోనే ఓడిపోయి టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించాయి. భారీ అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పరాగ్వే, మొరాకో సంచలన ఫలితాలతో ప్రపంచకప్‌లో మరో అడుగు ముందుకు వేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. మేటి జట్లకు కూడా చెమటలు పట్టించే ‘పెనాల్టీ షూటౌట్’లో పరాగ్వే 4–3తో జర్మనీపై... మొరాకో ‘పెనాల్టీ షూటౌట్’లో 3–2తో నెదర్లాండ్స్‌పై విజయం సాధించాయి.
బోస్టన్: గత మూడు ప్రపంచకప్ టోర్నీలకు అర్హత సాధించలేకపోయిన పరాగ్వే ఆ కసినంతా తాజా ప్రపంచకప్‌లో తీర్చుకుంటోంది. సమష్టి ఆటతీరుతో సత్తా చాటుకుంటోంది. లీగ్ దశలో మూడో స్థానంలో నిలిచిన ఎనిమిది అత్యుత్తమ జట్లలో ఒకటిగా నాకౌట్ దశకు చేరుకున్న పరాగ్వే... చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో నాలుగుసార్లు చాంపియన్, నాలుగుసార్లు రన్నరప్ జర్మనీ జట్టును కంగుతినిపించింది.
నిర్ణీత 90 నిమిషాలు ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. 42వ నిమిషంలో జూలియో ఎన్‌సిసో గోల్‌తో పరాగ్వే 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 54వ నిమిషంలో కాయ్ హావెట్జ్ గోల్‌తో జర్మనీ స్కోరును 1–1తో సమం చేసింది. రెగ్యులర్ సమయం ముగిశాక రెండు జట్లు సమఉజ్జీగా నిలవడంతో... ఫలితం తేల్చేందుకు అదనపు 30 నిమిషాలు ఆడించారు. అదనపు సమయం ముగిశాకా రెండు జట్లు సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయయించేందుకు ‘పెనాల్టీ షూటౌట్’ నిర్వహించారు.
‘షూటౌట్’లో జర్మనీ ముగ్గురు ఆటగాళ్లు హావెట్జ్, వోల్టెమేడ్, జొనాథన్... పరాగ్వే ఇద్దరు ఆటగాళ్లు సనబ్రియా, బల్‌బయేనా గురి తప్పారు. ఆరో షాట్‌ను కెనాలో గోల్‌గా మలచడంతో పరాగ్వే సంబరాలు చేసుకుంది. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ‘షూటౌట్’లో ఓడిపోయిన జర్మనీ బృందం నిరాశలో మునిగిపోయింది.
‘షూటౌట్’లో మూడో‘సారీ’
నెదర్లాండ్స్, మొరాకో మధ్య మ్యాచ్‌లో నిర్ణీత 90 నిమిషాలు పూర్తయ్యాక రెండు జట్లు 1–1తో సమఉజ్జీగా నిలిచాయి. 72వ నిమిషంలో కోడీ గాప్‌కో గోల్‌తో నెదర్లాండ్స్ 1–0తో ముందంజ వేసింది. 90+1వ నిమిషంలో ఇసా డియోప్ గోల్‌తో మొరాకో స్కోరును 1–1తో సమం చేసింది. అదనపు సమయంలోనూ ఫలితం రాకపోవడంతో విజేతను నిర్ణయించేందుకు ‘పెనాల్టీ షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో నెదర్లాండ్స్ ఆటగాళ్లు ఒత్తిడికి తలొగ్గి ఓటమిని మూటగట్టుకున్నారు. 2014, 2022 ప్రపంచకప్ టోర్నీల్లో ‘షూటౌట్’లోనే తడబడి నిష్క్ర మించిన నెదర్లాండ్స్ మూడోసారి ఈ మెగా ఈవెంట్‌లో ‘షూటౌట్’లో విఫలమైంది.


