పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pakistan) హాంగ్ కాంగ్ సిక్సస్ (Hong Kong Sixes-2025) ట్రోఫీని కైవసం చేసుంది. ఇవాళ (నవంబర్ 9) జరిగిన 2025 ఎడిషన్ ఫైనల్లో కువైట్‌పై 43 పరుగుల తేడాతో గెలుపొంది, ఆరో సారి ఛాంపియన్‌గా నిలిచింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 135 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది (Abbas Afridi) (11 బంతుల్లో 52 రిటైర్డ్ హర్ట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) కువైట్ బౌలర్లను చీల్చి చెండాడు.
ఓపెనర్లు అబ్దుల్ సమద్ (13 బంతుల్లో 42; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), ఖ్వాజా నఫే (6 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సైతం చెలరేగిపోయారు. మిగతా బ్యాటర్లలో షాహిద్ అజీజ్ డకౌట్ కాగా, మాజ్ సదాకత్ 10, షెహజాద్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. కువైట్ బౌలర్లలో మీట్ భావ్సర్ 3 వికెట్లు తీశాడు.
భారీ లక్ష్య ఛేదనలో కువైట్‌కు మెరుపు ఆరంభం లభించినప్పటికీ.. ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో 5.1 ఓవర్లలో 6 వికెట్లూ కోల్పోయి 92 పరుగులకే పరిమితమైంది. మాజ్ సదాకత్ 3 వికెట్లు తీసి కువైట్ వెన్ను విరిచాడు. ముహమ్మద్ షెహజాద్, అబ్బాస్ అఫ్రిది, అబ్దుల్ సమద్ తలో వికెట్ తీశారు.
కువైట్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు అద్నాన్ ఇద్రీస్ (8 బంతుల్లో 30; 5 సిక్సర్లు), మీట్ భావ్సర్ (12 బంతుల్లో 33; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఆతర్వాత వచ్చిన బిలాల్ తాహిర్ (6), రవీజా సందరువన్ (1), కెప్టెన్ యాసిన్ పటేల్ (14) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. మొహమ్మద్ షఫీక్ డకౌటయ్యాడు.
కాగా, ఈ టోర్నీలో భారత్ నేపాల్, యూఏఈ, కువైట్, శ్రీలంక వంటి పసికూన చేతుల్లో ఓడి క్వార్టర్ ఫైనల్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించింది.


