31 ఏళ్ల పాకిస్తాన్ క్రికెటర్ జాఫర్ గోహర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే బ్రిటిష్ పౌరసత్వం పొందిన అ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్, త్వరలో ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగాలని భావిస్తున్నాడు.
లాహోర్‌లో జన్మించిన గోహర్ 2015లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అనంతరం 2021లో న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడినా, ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టు అవకాశాలు రాలేదు. దీంతో విరక్తి చెందిన గోహర్ పాక్ నుంచి ఇంగ్లండ్‌కు మాకం మార్చేశాడు.

స్వల్ప అంతర్జాతీయ కెరీర్‌లో 2 వికెట్లు తీసి, 86 పరుగులు చేసిన గోహర్.. దేశవాలీ క్రికెట్‌లో ఘనమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 343 వికెట్లు తీసి, 3000కుపైగా పరుగులు సాధించాడు.
దేశీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ పాక్ క్రికెట్ బోర్డు తనను పట్టించుకోలేదని గోహర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడు. ముఖ్యంగా మొహ్సిన్ నక్వీ నేతృత్వంలోని బోర్డు, సెలక్షన్ కమిటీ తన ప్రతిభను గుర్తించలేదని బహిరంగ ఆరోపణలు చేశాడు.
గోహర్ దేశీయ దేశవాలీ క్రికెట్‌తో పాటు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లోనూ సత్తా చాటాడు. అయితే పాక్ సెలెక్టర్లు గోహర్ కౌంటీ ప్రదర్శనలను విస్మరించారు. ఓ సెలెక్టర్ ఏకంగా గోహర్ కౌంటీ ప్రదర్శనలను చిత్తు కాగితాలపై లెక్కలుగా అభివర్ణించాడు. దీంతో విసిగిపోయిన అతను ఇంగ్లండ్‌కు మకాం మార్చి, అక్కడ జాతీయ జట్టు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు.
ఇంగ్లండ్‌లో నాలుగు సీజన్లు గడిపిన గోహర్, ప్రస్తుతం మిడిల్‌సెక్స్ తరఫున స్థానిక ఆటగాడిగా ఆడుతున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో బ్యాట్, బాల్‌తో రాణిస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఇంగ్లండ్ జట్టులో ప్రస్తుతం నాణ్యమైన స్పిన్ బౌలర్ల కొరత ఉంది. షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్, విల్ జాక్స్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ, స్థిరమైన ఎడమచేతి స్పిన్నర్ అవసరం ఉంది.
ఈ నేపథ్యంలో గోహర్‌కు అవకాశం లభించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. జాక్ లీచ్ స్థానాన్ని భర్తీ చేసే దీర్ఘకాలిక ఎంపికగా గోహర్‌ను ఇంగ్లండ్ పరిశీలించే అవకాశం ఉంది. అవకాశం వస్తే సిద్ధంగా ఉంటానని గోహర్ స్పష్టం చేశాడు.


