
ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ బౌలర్ సదియా ఇక్బాల్ అగ్రస్థానానికి ఎగబాకింది. సదియా.. ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్‌ను కిందకు దించి టాప్ ప్లేస్‌కు చేరుకుంది. గత వారం ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉండిన సదియా ఓ స్థానం మెరుగుపర్చుకుంది.
తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో ఎక్లెస్టోన్ పాల్గొనకపోవడంతో సదియా అగ్రపీఠాన్ని దక్కించుకుంది. సదియా ఖాతాలో 746 రేటింగ్ పాయింట్లు ఉండగా.. ఎక్లెస్టోన్ ఖాతాలో 734 పాయింట్లు ఉన్నాయి. ఎక్లెస్టోన్ మూడు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయింది.
భారత స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ (737 పాయింట్లు), ఆసీస్ బౌలర్ అన్నాబెల్ సదర్‌ల్యాండ్ తలో స్థానం మెరుగుపర్చుకుని రెండు, మూడు స్థానాలకు ఎగబాకారు. భారత పేసర్ రేణుక సింగ్ ఠాకూర్ ఐదో స్థానాన్ని నిలబెట్టుకుంది.
ఇంగ్లండ్ బౌలర్ లారెన్ బెల్ ఏకంగా 13 స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరింది. మరో ఇంగ్లండ్ బౌలర్ చార్లీ డీన్, పాకిస్తాన్ బౌలర్ సష్రా సంధు, ఆస్ట్రేలియా బౌలర్ జార్జియా వేర్హమ్ ఏడు నుంచి తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్ సారా గ్లెన్ నాలుగు స్థానాలు కోల్పోయి పదో స్థానానికి పడిపోయింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 16, శ్రేయాంక పాటిల్ 21, పూజా వస్త్రాకర్ 33 స్థానాల్లో ఉన్నారు.
బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బెత్ మూనీ టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకుంది. విండీస్ స్టార్ బ్యాటర్ హేలీ మాథ్యూస్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగు నుండి రెండో స్థానానికి చేరింది.
ఆసీస్ బ్యాటర్ తహిళ మెక్‌గ్రాత్, టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన తలో స్థానం కోల్పోయి మూడు, నాలుగు స్థానాలకు పడిపోయారు. ఇంగ్లండ్ బ్యాటర్ నాట్ సీవర్ బ్రంట్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి ఎగబాకింది. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, దీప్తి శర్మ టాప్-3లో కొనసాగుతున్నారు.