క్రికెట్.. 128 ఏళ్ల సదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలను నిర్వహించేందుకు ఒలింపిక్ కమిటీ (IOC) ఇప్పటికే ఆమోదం తెలిపింది. టీ20 ఫార్మాట్‌లో ఈ పోటీలు జరగనున్నాయి.
ఈ టోర్నీలో ఆరు జట్లు చొప్పున పురుషులు, మహిళల జట్లు పాల్గొననున్నాయి. అయితే ఈ విశ్వక్రీడల్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశ ఎదురయ్యేలా ఉంది. ఎందుకంటే ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్లను ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా కాకుండా రీజియన్ల వారీగా ఎంపిక చేయాలని ఐసీసీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
తొలుత ర్యాంకింగ్స్ ఆధారంగా జట్లను ఎంపిక చేయాలని ఐసీసీ భావించినప్పటికి.. తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. ఆసియా, ఓషియానియా, యూరప్, ఆఫ్రికా నాలుగు రీజియన్లలో టాప్‌లో ఉన్న జట్లకు ఒలింపిక్స్‌లో నేరుగా ప్రవేశం లభిస్తుంది. ఐదో జట్టుగా ఆతిథ్య హోదాలో అమెరికా లేదా వెస్టిండీస్ గానీ అర్హత సాధిస్తోంది. ఇక ఆరో జట్టును గ్లోబల్ క్వాలిఫయర్ ద్వారా నిర్ణయిస్తారు.
కాగా అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా నంబర్ వన్ జట్టుగా కొనసాగుతుండడంతో ఆసియా ఖండం నుంచి పాకిస్తాన్‌కు చోటు దక్కే అవకాశం లేదు. ఒకవేళ టాప్-2 జట్లకు అవకాశమిస్తే మినహా పాకిస్తాన్ ఒలింపిక్స్‌లో పాల్గోనడం కష్టమే అనే చెప్పుకోవాలి. అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్ ప్రస్తుతం ఏడో స్ధానంలో కొనసాగుతోంది. ఇక లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ జులై 12న ప్రారంభం కానున్నాయి.
రీజియన్ల వారీగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించే జట్లు ఇవే?
ఆసియా: భారత్
ఓషియానియా: ఆస్ట్రేలియా
యూరప్: ఇంగ్లండ్
ఆఫ్రికా: దక్షిణాఫ్రికా
చదవండి: IND A Vs SA A: ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్


