
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీ ఫ్రాంచైజీ లీగ్స్‌లో ఆడేందుకు ఆటగాళ్లకు మంజారు చేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది. ఆసియాకప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి దృష్ట్యా పీసీబీ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం(సెప్టెంబర్ 28) దుబాయ్ వేదికగా జరిగిన తుది పోరులో 5 వికెట్ల తేడాతో పాక్‌ను టీమిండియా చిత్తు చేసింది. ఈ మెగా టోర్నీలో పాక్ జట్టు వరుసగా మూడో సారి చిరకాల ప్రత్యర్ధి చేతిలో ఓడిపోయింది. ఈ వరుస ఓటములను పీసీబీ జీర్ణించుకోలేకపోతుంది.
దీంతో టీ20 వరల్డ్‌కప్-2026ను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లను మరింత రాటు దేల్చాలని పాక్ క్రికెట్ సిద్దమైంది. ఆసియాకప్ పాక్ జట్టులో చోటు కోల్పోయిన బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్‌లతో పాటు మొత్తం ఏడుగురు ఆటగాళ్లు బిగ్ బాష్ లీగ్ 2025-26లో ఆడాల్సి ఉంది.
వీరిందరికి పీసీబీ ఇప్పటికే ఎన్‌వోసీ కూడా మంజారు చేసుకుంది. ఇప్పుడు పీసీబీ ఆకస్మిక నిర్ణయంతో వారి బిగ్ బాష్ లీగ్ భవితవ్యం సందిగ్ధంలో పడినట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్‌ఫో తమ కథనంలో పేర్కొంది. ఆజాం, రిజ్వాన్, షాహీన్ అఫ్రిదిలు ఇంటర్ననేషన్ టీ20 లీగ్ వేలంలో కూడా తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.
"పీసీబీ చైర్మెన్ ఆమోదంతో పాటు విదేశీ టోర్నమెంట్‌లలో పాల్గొనడానికి ఆటగాళ్లకు మంజారు చేసిన అన్ని నిరభ్యంతర సర్టిఫికెట్లు (ఎన్‌ఓసీలు) తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి" అని పీసీబీ సుమైర్ అహ్మద్ సయ్యద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇప్పటివరకు తమ కాంట్రాక్ట్ కలిగి ఉన్న ఆటగాళ్లు 12 నెలల వ్యవధిలో రెండు విదేశీ టీ20 లీగ్స్‌లో ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అనుమతి ఇచ్చింది. తాజాగా రెండు లీగ్స్‌లో ఆడేందుకు కూడా అనుమతిని పీసీబీ నిరాకరించింది.
చదవండి: టీమిండియాకు బ్యాడ్ న్యూస్