
ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 21) జరుగబోయే సూపర్ 4 మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ జట్టుపై భారత మాజీ సెలెక్టర్, వరల్డ్‌కప్ విన్నిర్ (1983) కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ జట్టు చెన్నై లోకల్ లీగ్‌లో 7వ డివిజన్ జట్టులా ఉందని అన్నారు.
ఇలాంటి బలహీనమైన జట్టుతో ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో పాల్గొనడం పాకిస్తాన్ చేసుకున్న అదృష్టమని తెలిపారు. ఈ జట్టుకు టీమిండియాతో ఆడే అర్హత లేదని అభిప్రాయపడ్డారు. పాక్ జట్టును అసోసియేట్ దేశాల జట్లతోనే ఆడించాలని సూచించారు.
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లు ఇకపై జనాన్ని ఆకర్షించవని అన్నారు. భారత్-పాక్ హోరీహోరీ సమరాలు చరిత్రే అని అభిప్రాయపడ్డారు. హెస్సన్ లాంటి కోచ్ వల్ల కూడా పాక్‌కు ఒరిగేదేమీ లేదని తెలిపారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్‌లో వ్యాఖ్యానించారు.
శ్రీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ అభిమానులే సానుకూలంగా స్పందిస్తున్నారు. నిజంగానే తమ జట్టు గల్లీ జట్ల కంటే హీనంగా ఉందని అంటున్నారు. తమ దేశ క్రికెట్ చరిత్రలో ఇంత దారుణమైన జట్టును చూడలేదని చర్చించుకుంటున్నారు.
కాగా, ప్రస్తుత ఆసియా కప్‌లో పాకిస్తాన్ చచ్చి చెడి సూపర్ 4కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో ఒమన్‌పై ఘనంగా గెలిచినా.. టీమిండియా చేతిలో ఘెర పరాజయాన్ని ఎదుర్కొంది. సూపర్ 4కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యూఏఈ చేతిలో భంగపాటును తృటిలో తప్పించుకుంది.