Photo Credit: Twitter
21వ శతాబ్దంలో ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లు ఎవరనేది ఇంగ్లండ్ సీనియర్ ప్లేయర్ జోస్ బట్లర్ తనదైన శైలిలో వివరించాడు. ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌తో కలిసి బట్లర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 'ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్' (For the Love of Cricket) పాడ్‌కాస్ట్‌లో 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్ల జాబితాను ప్రకటించాడు. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, మెక్‌గ్రాత్ వంటి దిగ్గజ బౌలర్లకు చోటు కల్పించారు.
బుమ్రా@3
ఈ జాబితాలో భారత్ నుంచి ఒక్క బౌలర్ మాత్రమే చోటు సంపాదించాడు. ప్రస్తుతం టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో కీలక బౌలర్‌గా ఉన్న జస్ప్రీత్ బుమ్రాకు జాబితాలో మూడో స్థానం దక్కడం విశేషం. ఈతరంలో బెస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన బుమ్రా 243 మ్యాచ్‌ల్లో (అన్ని ఫార్మాట్లు కలిపి) 513 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 18 ఐదు వికెట్ల హాల్స్ ఉన్నాయి.
రెండు టీ20 ప్రపంచకప్‌లు సాధించిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్న బుమ్రా 2024 టీ20 ప్రపంచకప్‌లో 'ఫ్లేయర్ ఆఫ్ ది టోర్నీ', 2026 టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు సొంతం చేసుకున్నాడు. అయితే బట్లర్, బ్రాడ్లు ప్రకటించిన జాబితాలో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే సహా రవిచంద్రన్ అశ్విన్‌లకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
తొలి రెండు స్థానాల్లో వార్న్, అండర్సన్
ఇక ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్‌కు జాబితాలో తొలి స్థానం దక్కడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్లో వెయ్యి వికెట్ల మార్క్ దాటిన రెండో క్రికెటర్‌గా షేన్ వార్న్ నిలిచాడు. అంతర్జాతీయ టెస్టుల్లో మురళీధరన్ తర్వాతి స్థానంలో ఉన్న షేన్ వార్న్ (145 టెస్టుల్లో 708 వికెట్లు) ఆసీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇక 194 వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు.
జాబితాలో రెండో స్థానం ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్‌కు కేటాయించారు. ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి 991 వికెట్లు తీసిన అండర్సన్ ఈతరం పేసర్లలో టాప్‌లో ఉంటాడు. స్టువర్ట్ బ్రాడ్‌తో కలిసి బంతిని పంచుకున్న అండర్సన్ ఎన్నో మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు విజయాలు అందించాడు.
నాలుగులో మెక్‌గ్రాత్.. ఐదులో కమిన్స్
బుమ్రాకు మూడో స్థానం కేటాయించగా, ఆసీస్ దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌కు నాలుగో స్థానం కల్పించారు. మూడుసార్లు వన్డే వరల్డ్‌కప్ గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యుడిగా ఉన్న మెక్‌గ్రాత్ అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి 949 వికెట్లు పడగొట్టాడు. వన్డే ప్రపంచకప్పుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మెక్‌గ్రాత్ (71 వికెట్లు) పేరిట ఉన్న రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.
ఇక ఐదో స్థానానికి ప్రస్తుత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌ను ఎంపిక చేయడం విశేషం. ఈతరం కెప్టెన్లలో బెస్ట్‌గా పేరు పొందిన కమిన్స్ (అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి 535 వికెట్లు) 2023 వన్డే ప్రపంచకప్‌తో పాటు అదే ఏడాది జరిగిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఆస్ట్రేలియా గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
లంక దిగ్గజానికి ఆరో స్థానం
ఇక లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌కు ఆరో స్థానం కేటాయించారు. ప్రపంచంలోనే అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించిన మురళీధరన్ (1,347 వికెట్లు) నిలిచాడు. 1996 వన్డే ప్రపంచకప్‌తో పాటు 2002 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన లంక జట్టులో మురళీధరన్ సభ్యుడిగా ఉన్నాడు.
7,8,9లో సౌతాఫ్రికా స్టార్లు
ఇక ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో సౌతాఫ్రికా పేసర్లు వరుసగా చోటు దక్కించుకున్నాడు. 699 వికెట్లు పడగొట్టిన డేల్ స్టెయిన్‌కు ఏడో స్థానంలో, 631 వికెట్లు తీసిన కగిసో రబాడ 8వ స్థానంలో, దిగ్గజ బౌలర్ షాన్ పొలాక్ (823 వికెట్లు) 9వ స్థానంలో ఉన్నారు. ఇక చివరి స్థానం ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌కు దక్కింది. రెండుసార్లు వరల్డ్‌కప్ విజేత, టెస్టు చాంపియన్‌షిప్ విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న స్టార్క్ అంతర్జాతీయంగా 773 వికెట్లు పడగొట్టాడు.
బట్లర్, బ్రాడ్ ఎంపిక చేసిన టాప్-10 బౌలర్లు:
షేన్ వార్న్, జేమ్స్ ఆండర్సన్, జస్ప్రీత్ బుమ్రా, గ్లెన్ మెక్‌గ్రాత్, పాట్ కమిన్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, కగిసో రబాడ, షాన్ పొల్లాక్, మిచెల్ స్టార్క్
ఇదీ చదవండి:


