
టీమిండియాతో ఐదో టెస్టుకు ముందు ఇంగ్లండ్ స్టార్ ఓలీ పోప్ (Ollie Pope)నకు ఓ చెత్త రికార్డు ఉండేది. రెగ్యులర్ కెప్టెన్ గైర్హాజరీలో తాత్కాలిక సారథిగా వ్యవహరించే ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇప్పటికి నాలుగుసార్లు టాస్ ఓడిపోయాడు.
రెండింటినీ ఒకేసారి అధిగమించేశాడు
అంతేకాదు.. రివ్యూ (Decision Review System) విషయంలోనూ పద్నాలుగుసార్లు పోప్ విఫలమయ్యాడు. అయితే, ఓవల్ టెస్టు సందర్భంగా ఓలీ పోప్ ఈ రెండింటినీ ఒకేసారి అధిగమించేశాడు. బెన్ స్టోక్స్ (Ben Stokes) భుజం నొప్పి కారణంగా టీమిండియాతో ఐదో టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఓలీ పోప్ ఐదోసారి ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్‌గా తొలిసారి టాస్ గెలిచిన అతడు.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఈసారి ధైర్యంగానే రివ్యూకు
ఈ క్రమంలో క్రిస్ వోక్స్ చేతికి కొత్త బంతినివ్వగా.. అతడు ఇంగ్లండ్ బౌలింగ్ అటాక్ మొదలుపెట్టాడు. అయితే, మ్యాచ్ మొదలైన కాసేపటికే ఆతిథ్య జట్టుకు గస్ అట్కిన్సన్ మంచి బ్రేక్ ఇచ్చాడు. నాలుగో ఓవర్ రెండో బంతికే టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
అయితే, ఫీల్డ్ అంపైర్ మాత్రం జైసూను లెగ్ బిఫోర్ వికెట్ (LBW)గా వెనక్కి పంపడానికి నిరాకరించాడు. అట్కిన్సన్ మాత్రం ఆత్మవిశ్వాసంతో కనిపించడంతో కెప్టెన్ పోప్ ధైర్యంగానే రివ్యూకు వెళ్లాడు. ఈసారి మాత్రం అతడి అంచనా తప్పలేదు.
స్టోక్స్‌కు సైగ చేసి మరీ..
రీప్లేలో బంతి జైసూ ప్యాడ్‌ను తాకినట్లు స్పష్టంగా తేలింది. దీంతో ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తారుమారైంది. ఫలితంగా భారత్ తొలి వికెట్ కోల్పోగా.. పోప్ సంబరాల్లో మునిగిపోయాడు. రెండు చేతులు పైకెత్తి సాధించాను అన్నట్లుగా.. డ్రెసింగ్‌రూమ్ నుంచి మ్యాచ్ వీక్షిస్తున్న స్టోక్స్‌కు సైగ చేశాడు. దీంతో స్టోక్స్ సైతం నవ్వులు చిందిస్తూ పోప్‌ను చూసి సంతోషించాడు.
పదిహేనోసారి ఖతమే అనుకున్నా
అయితే, థర్డ్ అంపైర్ నిర్ణయానికి ముందు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆథర్టన్ పోప్ పట్ల సానుభూతి వ్యక్తం చేశాడు. ‘‘ఇది ఇన్‌సైడ్ ఎడ్జ్. రెండు శబ్దాలు వినిపించాయి. కానీ పోప్ మాత్రం రివ్యూకు వెళ్లాడు. ఇప్పటికే అతడు పద్నాలుగుసార్లు డీఆర్‌ఎస్ విషయంలో ఫెయిలయ్యాడు.
నాకెందుకో పదిహేనోసారి కూడా ఇలాగే జరుగుతుందేమో అనిపిస్తోంది’’ అని కామెంట్రీలో చెప్పాడు. అయితే, ఆ తర్వాత అతడు నాలిక్కరుచుకున్నాడు. నిజానికి జైస్వాల్ ఎల్బీడబ్ల్యూ సమయంలో రెండు శబ్దాలు వచ్చాయి. అయితే, బంతి బ్యాట్‌ను మాత్రం తాకలేదు. తొలుత ఫ్రంట్ ప్యాడ్, ఆ తర్వాత బ్యాక్ ప్యాడ్‌ను తాకింది.
రెండు వికెట్లు డౌన్
రీప్లేలో బంతి స్టంప్‌ను ఎగురగొట్టినట్లు తేలడంతో జైస్వాల్ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరగక తప్పలేదు. ఇక పదహారో ఓవర్ మొదటి బంతికే టీమిండియా రెండో వికెట్ కూడా కోల్పోయింది. వోక్స్ బౌలింగ్‌లో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (14) బౌల్డ్ అయ్యాడు.
వర్షం.. లంచ్ బ్రేక్
వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో కాస్త ముందుగానే భోజన విరామం వచ్చింది. అప్పటికి 23 ఓవర్ల ఆట పూర్తికాగా సాయి సుద్శన్ 25, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 15 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు: 72/2 (23).
చదవండి: అతడి పేరు మర్చిపోయిన గిల్.. వాళ్లిద్దరికి భంగపాటు! ఒక్క మ్యాచ్ ఆడకుండానే..
Ollie Pope 🤝 DRS
🇮🇳 1️⃣0️⃣-1️⃣ pic.twitter.com/VyX4061MvH— England Cricket (@englandcricket) July 31, 2025