
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌లో పాల్గొనే టీమిండియా గురించి భారత క్రికెట్ వర్గాల్లో ప్రధానంగా చర్చ నడుస్తోంది. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను పక్కనపెట్టడంతో సెలక్టర్లపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
విమర్శలకు కారణం?
అదే విధంగా.. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), వాషింగ్టన్ సుందర్‌లను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేయడం.. రీఎంట్రీలో వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు ప్రమోషన్ ఇవ్వడం చర్చకు దారితీశాయి.
అంతేకాదు.. ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోని హర్షిత్ రాణా, రింకూ సింగ్, శివం దూబేలను ఆసియా కప్ జుట్టుకు ఎంపిక చేయడం కూడా విమర్శలకు తావిచ్చాయి.
ఈ జట్టునే గనుక టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగిస్తే టీమిండియా టైటిల్ గెలవలేదంటూ మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు విమర్శలే చేశాడు. ఈ నేపథ్యంలో జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వరల్డ్‌కప్ టోర్నీకి ఇదే ఫైనల్ స్క్వాడ్ కాదు
వాషింగ్టన్ సుందర్ గురించి మీడియా సమావేశంలో ప్రస్తావన రాగా.. ‘‘మా ప్రణాళికల్లో సుందర్ ఎల్లప్పుడూ ఉంటాడు. అయినా.. వరల్డ్‌కప్ టోర్నీకి ఇదే ఫైనల్ స్క్వాడ్ కాదు. ప్రస్తుతం మా జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. నలుగురు గనుక అవసరం ఉంటే.. సుందర్ కచ్చితంగా టీమ్‌లోకి వచ్చేవాడు.
అయితే, ప్రస్తుత సమీకరణల దృష్ట్యా రింకూ సింగ్‌ను అదనపు బ్యాటర్‌గా ఎంపిక చేసుకున్నాం. జితేశ్, సంజూ వికెట్ కీపర్లుగా సేవలు అందిస్తారు. ప్రస్తుతం మాకు 15 మందిని మాత్రమే ఎంపిక చేసే అవకాశం ఉంది. ఒకవేళ 16 మందిని ఎంపిక చేయాలంటే సుందర్ ఉండేవాడు.
వారికి తలుపులు తెరిచే ఉన్నాయి
ఇక ముందు.. వరల్డ్‌కప్ వరకు టీమిండియా 20 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కాబట్టి ఎవరు జట్టులో ఉంటారో.. ఎవరు వెళ్లిపోతారో వారి ప్రదర్శనలపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచకప్ టోర్నీ ముగిసిన వెంటనే.. తదుపరి వరల్డ్‌కప్‌నకు జట్టును సిద్ధం చేసుకోవడం సహజం.
గాయాలు, ఫామ్.. ప్రధానంగా జట్టు ఎంపికను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ జట్టులో మార్పులు ఉండవచ్చు. జట్టులో ఎవరూ శాశ్వతం కాదు. 18 లేదంటే 20 మంది ఆటగాళ్లను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటాం.
వారి నుంచి అత్యుత్తమ, అవసరమైన జట్టునే ఎంపిక చేస్తాం’’ అని అగార్కర్ పేర్కొన్నాడు. తద్వారా ఆసియా కప్ టోర్నీకి ఎంపిక కాని ఆటగాళ్లకు కూడా ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని సంకేతాలు ఇచ్చాడు.
ఎనిమిది జట్లు
కాగా భారత్ ఆతిథ్యంలో యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకంగా ఈసారి ఈ ఖండాంతర టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ జట్లు ఇందులో పాల్గొంటున్నాయి.
ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి టీమిండియా
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.
చదవండి: నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు.. నేనేంటో నాకు తెలుసు: పృథ్వీ షా