
టెస్టుల్లో గత సిరీస్‌లలో వరుస పరాభవాలు చవిచూసిన టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC)-2025 ఫైనల్‌కు దూరమైంది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌ను విజయంతో ఆరంభించాలని పట్టుదలగా ఉంది. ఇక 2025-27 సీజన్లో భాగంగా తొలుత ఇంగ్లండ్ (India vs England)తో తలపడనుంది.
ఇంగ్లండ్ వేదికగా జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. అయితే, ఈ కీలక సిరీస్‌కు రోహిత్ శర్మ (Rohit Sharma) అందుబాటులో ఉంటాడని.. అతడినే కెప్టెన్‌గా కొనసాగిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా రోహిత్ బుధవారం అధికారికంగా టెస్టులకు వీడ్కోలు పలికాడు.
రేసులో నలుగురు!
ఈ నేపథ్యంలో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వారసుడు ఎవరన్న అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ (Rishabh Pant)లకు అవకాశం ఇవ్వాలని కొంత మంది మాజీలు సూచిస్తుంటే.. మరికొంత మంది మాత్రం సీనియర్లైన కేఎల్ రాహుల్ లేదా పేస్‌దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రాకు పగ్గాలు ఇవ్వాలంటున్నారు.
కాగా బుమ్రా ఇటీవలి కాలంలో ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిపై పనిభారం పడకుండా ఉండేందుకు వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తొలగించాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మాత్రం బుమ్రాకు మద్దతుగా నిలిచాడు.
టీమిండియా కెప్టెన్‌గా అతడే ఉండాలి
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు బుమ్రాను కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐకి సూచించాడు. ఈ మేరకు.. ‘‘ఫాస్ట్ బౌలర్‌గా సుదీర్ఘకాలం కొనసాగడం అంత సులువేమీ కాదు. గాయాల బెడద వేధిస్తూనే ఉంటుంది.
ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత చాన్నాళ్లు విరామం తీసుకున్న అనంతరం బుమ్రా మళ్లీ ఐపీఎల్‌తో తిరిగి ఆటలో అడుగుపెట్టాడు. అతడికి ఫిట్‌నెస్ సమస్యలు ఉన్నాయన్న మాట వాస్తవమే.
అయితే, కనీసం ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మాత్రం కెప్టెన్‌గా అతడికే బాధ్యతలు అప్పగించండి. ఆ తర్వాత ఫిట్‌నెస్ విషయంలో సమస్యలు తలెత్తితే ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోండి’’ అని కుంబ్లే ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో పేర్కొన్నాడు.
కాగా బుమ్రాపై పనిభారం తగ్గించే క్రమంలో ఇంగ్లండ్‌లో అత్యధికంగా మూడు మ్యాచ్‌లలో మాత్రమే అతడిని ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కాబట్టి ఒకవేళ అతడిని కెప్టెన్‌ను చేస్తే.. మధ్యలోనే మరొకరిని సారథిగా నియమించాల్సి వస్తుందనే కారణంతో.. బుమ్రా పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదని సమాచారం.
ఐదు టెస్టులూ ఆడకపోతే ఏంటి?
అయితే, బుమ్రా నిజంగానే ఇంగ్లండ్‌లో ఐదు టెస్టులూ ఆడకపోవచ్చన్న కుంబ్లే.. కెప్టెన్‌గా నియమించేందుకు అదేమీ అడ్డుకాకపోవచ్చని పేర్కొన్నాడు. బుమ్రా గైర్హాజరీలో వైస్ కెప్టెన్ సారథిగా బాధ్యతలు తీసుకుంటాడని.. ఇందులో ఎలాంటి సమస్యా ఉండదని అభిప్రాయపడ్డాడు.
కాగా బుమ్రా గతంలో ఇంగ్లండ్ పర్యటనలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా రోహిత్ శర్మ గైర్హాజరీలో సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. కెప్టెన్‌గా.. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్‌ను గెలిపించిన ఈ రైటార్మ్ పేసర్.. సిడ్నీ టెస్టులో మాత్రం జట్టుకు విజయం అందించలేకపోయాడు.
ఇక టీమిండియా గత రెండు టెస్టు సిరీస్‌లలో ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురికావడం సహా.. ఆసీస్ పర్యటనలో పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(3-1)ని చేజార్చుకుంది. ఈ రెండు సిరీస్‌లలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా, ఆటగాడిగా పూర్తిగా విఫలమయ్యాడు.
చదవండి: IPL 2025: ధనాధన్‌గా దూసుకొచ్చారు