IPL 2025: ధనాధన్‌గా దూసుకొచ్చారు | Young cricketers shine in IPL | Sakshi
Sakshi News home page

IPL 2025: ధనాధన్‌గా దూసుకొచ్చారు

May 10 2025 3:53 AM | Updated on May 10 2025 9:35 AM

Young cricketers shine in IPL

ఐపీఎల్‌లో యువ క్రికెటర్ల మెరుపులు

భవిష్యత్తుపై భరోసా పెంచుతున్న ఆయుశ్, ప్రియాన్ష్, వైభవ్‌

నిలకడగా రాణిస్తున్న అభిషేక్‌ పొరెల్, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌

14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో కోట్లు కొల్లగొట్టిన బిహార్‌ బుడ్డోడు  వైభవ్‌ సూర్యవంశీ... బరిలోకి దిగిన మూడో మ్యాచ్‌లోనే రికార్డు సెంచరీతో తన పేరు మారుమోగేలా చేసుకున్నాడు! 

ప్రదాన ఆటగాళ్లంతా విఫలమవుతున్న చోట... నేనున్నానంటూ బాధ్యతలు భూజానికెత్తుకున్న 17 ఏళ్ల ఆయుశ్‌ మాత్రే ఆడింది తక్కవ మ్యాచ్‌లే అయినా... చెన్నై భవిష్యత్తు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు!

పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ ధాటిగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లకు గుబులు పుట్టిస్తుంటే... ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ అభిషేక్‌ పొరెల్‌ తన నిలకడతో ఆకట్టుకున్నాడు. తాజా ఐపీఎల్‌ సీజన్‌లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న అన్‌క్యాప్డ్‌ ఓపెనర్లపై కథనం...            

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 18వ సీజన్‌ వారం రోజులపాటు వాయిదా పడింది. ఇప్పటి వరకు 58 మ్యాచ్‌లు జరిగాయి. మరో 12 లీగ్‌ మ్యాచ్‌లు... ఆ తర్వాత 4 ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. వారం రోజుల తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి ఐపీఎల్‌ టోర్నీ ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో స్టార్‌ ఆటగాళ్లకంటే ఏమాత్రం అంచనాలు లేని యువ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. హేమాహేమీలతో పోటీపడుతూ... తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఈ ఏడాది ముఖ్యంగా యువ ఓపెనర్ల జోరు ఎక్కువ కనిపిస్తోంది. వైభవ్‌ సూర్యవంశీ (రాజస్తాన్‌ రాయల్స్‌), ఆయుశ్‌ మాత్రే (చెన్నై సూపర్‌ కింగ్స్‌), అభిషేక్‌ పొరెల్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌)... ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్‌ (పంజాబ్‌ కింగ్స్‌) ఈ కోవలోకే వస్తారు. టీమిండియా గడప తొక్కాలంటే... ఐపీఎల్‌లో రాణించడం తప్పనిసరిలా మారిపోయిన ప్రస్తుతం తరుణంలో ఈ సీజన్‌లో ఈ ఐదుగురు ఆటగాళ్లు తమదైన ముద్ర వేస్తున్నారు. 

ఇందులో ఒక్కొక్కరి శైలి ఒక్కో రకం కాగా... అందరి లక్ష్యం భారీగా పరుగులు సాధించడమే. తాజా సీజన్‌లో అన్‌క్యాప్డ్‌ (జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని ఆటగాళ్లు)  ప్లేయర్లుగా బరిలోకి దిగి పేసర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా విరుచుకుపడుతున్న ఈ యువతరం... భారత క్రికెట్‌ భవిష్యత్తుపై మరింత భరోసా పెంచుతోంది.  

ఆహా... ఆయుశ్‌  
ముంబైకి చెందిన 17 ఏళ్ల ఆయుశ్‌ మాత్రేకు అనూహ్యంగా ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో ఈ యువ ఓపెనర్‌ను రూ. 30 లక్షలు ఇచ్చి జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లోనే 15 బంతుల్లో 32 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం ఓపెనర్‌... బెంగళూరుతో మ్యాచ్‌లో 48 బంతుల్లో 94 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 

బౌలర్‌ ఎవరైనా లెక్కచేయకపోవడం... బంతి తన పరిధిలో ఉంటే చాలు విరుచుకుపడటం ఆయుశ్‌ ప్రధాన అ్రస్తాలు. ఈ సీజన్‌లో చెన్నై జట్టు పేలవ ప్రదర్శన కనబర్చడంతో ఆయుశ్‌ మెరుపులు పెద్దగా వెలుగులోకి రాలేదు. అయితే సాధారణ ఆటగాళ్లను సైతం మ్యాచ్‌ విన్నర్లుగా తీర్చిదిద్దగల ధోని సారథ్యంలో మాత్రే భవిష్యత్తులో మరింత రాటుదేలడం ఖాయమే.  

మ్యాచ్‌లు    పరుగులు    అత్యధిక స్కోరు    స్ట్రయిక్‌ రేట్‌ 
5                 163                 94             181.11

అభిషేక్‌ అదుర్స్‌
ఈ ఏడాది అంచనాలకు మించి రాణిస్తున్న ఆటగాళ్లలో అభిషేక్‌ పొరెల్‌ ఒకడు. గతేడాది ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచగా... దాన్ని పొరెల్‌ నిలబెట్టుకుంటున్నాడు. తాజా సీజన్‌లో సహచర ఓపెనర్లు నిలకడ కనబర్చలేకపోయినా... పొరెల్‌ మాత్రం ప్రభావం చూపాడు. 22 ఏళ్ల ఈ ఎడం చేతి వికెట్‌ కీపర్‌... కేఎల్‌ రాహుల్‌ తర్వాత ప్రస్తుతం ఢిల్లీ జట్టులో రెండో అత్యధిక స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 

పేస్‌తో పాటు స్పిన్‌ను కూడా సమర్థవంతంగా ఎదుర్కోగల పొరెల్‌ నైపుణ్యం అతడిని క్లాస్‌ ప్లేయర్ల జాబితాలో చేర్చుతుంది. బంతిపై మరీ పగబడినట్లు కాకుండా... సుతారాంగా అతడు కొట్టే షాట్లు క్రీడాభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. బ్యాటింగ్‌లో భళా అనిపించుకుంటున్న పొరెల్‌... స్ట్రయిక్‌ రొటేషన్‌ ప్రాధానత్యను అర్థం చేసుకుంటూ ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్న తీరు ముచ్చటేస్తోంది.  

మ్యాచ్‌లు    పరుగులు    అత్యధిక స్కోరు    స్ట్రయిక్‌ రేట్‌ 
12                265               51               149.71

వైభవ్‌ జ్వాల
ఐపీఎల్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్‌ బాది... తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్న 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ మూడో మ్యాచ్‌లోనే రికార్డు సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. చిన్నప్పటి నుంచి క్రికెటే శ్వాసగా పెరిగిన ఈ బిహార్‌ ఎడంచేతి వాటం ఓపెనర్‌... గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. జైపూర్‌ వేదికగా జరిగిన పోరులో 7 ఫోర్లు, 11 సిక్స్‌లతో చెలరేగిపోయాడు. 

రెండొందల పైచిలుకు లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్నా ఏమాత్రం వెరవకుండా విరుచుకుపడి టి20ల్లో సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.  94 పరుగుల వద్ద ఉండి కూడా ధైర్యంగా సిక్స్‌ కొట్టి మూడంకెల స్కోరు అందుకున్న ఈ కుర్రాడు. ఆ తర్వాత పెద్ద ఇన్నింగ్స్‌ ఆడకపోయినా... అతడిలో ప్రతిభకు కొదవలేదని మాత్రం నిరూపితమైంది. 

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ మాదిరిగా వైభవ్‌క కూడా చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంచనాల ఒత్తిడి దరి చేరనివ్వకుండా... నిలకడ కొనసాగిస్తే వీరిలో కొందరు ఆటగాళ్లు టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.

మ్యాచ్‌లు    పరుగులు    అత్యధిక స్కోరు    స్ట్రయిక్‌ రేట్‌ 
5                 155               101             209.45

ఫటాఫట్‌.. ప్రభ్‌సిమ్రన్‌
ఈ ఏడాది పంజాబ్‌ కింగ్స్‌ మంచి ప్రదర్శన చేస్తోంది అంటే... దాని ప్రధాన కారణాల్లో ఓపెనింగ్‌ జోడీ ప్రదర్శన ముఖ్యమైంది. ఒక ఎండ్‌లో ఆర్య అదరగొడుతుంటే... మరో ఎండ్‌ నుంచి ‘పిట్ట కొంచం కూత ఘనం’లాగా ప్రభ్‌సిమ్రన్‌ చెలరేగిపోతున్నాడు. ఫలితంగానే చాన్నాళ్ల తర్వాత పంజాబ్‌ జట్టు ప్లే ఆఫ్స్‌ దిశగా సజావుగా సాగుతోంది. 

హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ శిక్షణ, శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో భయం లేకుండా ఆడుతున్న 24 ఏళ్ల ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌... జట్టు నమ్మదగ్గ ఆటగాళ్లలో ఒకడిగా మారిపోయాడు. లక్నోపై 48 బంతుల్లోనే 91 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రన్‌... స్లో పిచ్‌పై కోల్‌కతా స్పిన్నర్లను ఎదుర్కొని 83 పరుగులు చేశాడు. పవర్‌ప్లేను పూర్తిగా వినియోగించుకుంటూ భారీగా పరుగులు రాబడుతున్న ఈ కుడి చేతి వాటం బ్యాటర్‌... భవిష్యత్తుపై భరోసా పెంచుతున్నాడు.

మ్యాచ్‌లు    పరుగులు    అత్యధిక స్కోరు    స్ట్రయిక్‌ రేట్‌ 
12               487                 91             170.87

ప్రియాన్ష్ ‘స్పెషల్‌ టాలెంట్‌’
ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో ‘స్పెషల్‌ టాలెంట్‌’ అని ప్రశంసలు అందుకున్న 23 ఏళ్ళ ప్రియాన్ష్ ఆర్య... చెన్నైపై సెంచరీ బాది ప్రకంపనలు సృష్టించాడు. బంతిని నిశితంగా గమనించడంతో పాటు దాని వేగాని ప్రియాన్ష్ ఆర్య..కి అనుగుణంగా షాట్లను ఎంపిక చేసుకొని అప్పటికప్పుడు వాటిని అమలు చేయడంలో ప్రియాన్ష్ దిట్ట. ముల్లాన్‌పూర్‌ వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ప్రియాన్ష్... ఇన్నింగ్స్‌ను పరిశీలిస్తే ఇది అవగతమవుతుంది.

బ్యాటింగ్‌కు అంతగా అనుకూలంగా లేని పిచ్‌పై ఆర్య అదరగొట్టి ఐపీఎల్‌లో ఐదో వేగవంతమైన శతకం (39 బంతుల్లో) చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఢిల్లీకి చెందిన ఈ ఎడం చేతివాటం బ్యాటర్‌... ఫోర్ల కంటే ఎక్కువ సిక్స్‌లు కొట్టడంలో సిద్ధహస్తుడు. 

అభిమానులు ముద్దుగా ‘లెఫ్ట్‌ హ్యాండ్‌ సెహ్వాగ్ ’ అని పిలుచుకుంటున్న ఆర్య... ఈ సీజన్‌లో పంజాబ్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌తో కలిసి జట్టుకు మెరుగైన ఆరంభాలు అందించడం... పవర్‌ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబడుతుండటంతో... మిడిలార్డర్‌ స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయగలుగుతోంది.

మ్యాచ్‌లు    పరుగులు    అత్యధిక స్కోరు    స్ట్రయిక్‌ రేట్‌ 
12                417              103              194.85 

Advertisement
 
Advertisement
Advertisement