యూకీ బాంబ్రీకి ఐదో డబుల్స్‌ టైటిల్‌ | Fifth doubles title for Yuki Bhambri | Sakshi
Sakshi News home page

యూకీ బాంబ్రీకి ఐదో డబుల్స్‌ టైటిల్‌

Oct 26 2026 4:19 AM | Updated on Oct 26 2026 4:19 AM

Fifth doubles title for Yuki Bhambri

అల్మాటీ (కజకిస్తాన్‌): భారత టెన్నిస్‌ డబుల్స్‌ నంబర్‌వన్‌ యూకీ బాంబ్రీ ఈ ఏడాది టైటిల్‌ బోణీ కొట్టాడు. ఆదివారం ముగిసిన అల్మాటీ ఓపెన్‌ ఏటీపీ–250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్‌)–ర్యాన్‌ సెగర్మన్‌ (అమెరికా) జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో యూకీ–సెగర్మన్‌ ద్వయం 7–6 (7/3), 6–7 (1/7), 10–2తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో టాప్‌ సీడ్‌ లుకకాస్‌ మిడ్లెర్‌–నీల్‌ ఒబెర్‌లెట్నర్‌ (ఆస్ట్రియా) జంటను ఓడించింది. 82 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో యూకీ–సెగర్మన్‌ జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించి, ఒక డబుల్‌ ఫాల్ట్‌ చేసింది. 

రెండు జోడీలు తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో రెండు సెట్‌లు టైబ్రేక్‌కు దారితీశాయి. నిర్ణాయక ‘సూపర్‌ టైబ్రేక్‌’లో యూకీ–సెగర్మన్‌ ద్వయం ఆధిపత్యం కనబరిచి ముందుగా పది పాయింట్లు సాధించి విజయాన్ని అందుకుంది. యూకీ–సెగర్మన్‌ జంటకు 56,880 డాలర్ల (రూ. 54 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఢిల్లీకి చెందిన 34 ఏళ్ల యూకీ కెరీర్‌లో ఇది ఐదో ఏటీపీ డబుల్స్‌ టైటిల్‌. గతంలో అతను మలోర్కా ఓపెన్‌ (2023లో), గస్టాడ్‌ ఓపెన్, మ్యూనిక్‌ ఓపెన్‌ (2024లో), దుబాయ్‌ ఓపెన్‌ (2025లో) డబుల్స్‌ టైటిల్స్‌ సాధించాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement