ఏపీ డిప్యూటీ కలెక్టర్‌ ఖాతాలో మరో టైటిల్‌ | Karnataka Open: Saketh Myneni Nikki Poonacha Won Doubles Title | Sakshi
Sakshi News home page

ఏపీ డిప్యూటీ కలెక్టర్‌ ఖాతాలో మరో టైటిల్‌

May 17 2026 10:45 AM | Updated on May 17 2026 11:32 AM

Karnataka Open: Saketh Myneni Nikki Poonacha Won Doubles Title

బెంగళూరు: భారత డేవిస్‌కప్‌ జట్టు మాజీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని తన కెరీర్‌లో 21వ ఏటీపీ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. శనివారం ముగిసిన కర్ణాటక ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–50 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత్‌కే చెందిన నిక్కీ కలియంద పునాచాతో జతకట్టి ఆడిన సాకేత్‌ విజేతగా నిలిచాడు. 

పీటర్‌ బార్‌ బిరుకోవ్‌ (రష్యా)–గ్రిగోరి లొమాకిన్‌ (కజకిస్తాన్‌) జోడీతో జరిగిన తుది పోరులో సాకేత్‌–పునాచా జంట 6–2, 6–3తో విజయం సాధించింది. కేవలం 52 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్‌–పునాచా మూడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. 

తమ సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోకుండా, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేశారు. విజేతగా నిలిచిన సాకేత్‌–పునాచాలకు 2,980 డాలర్ల (రూ. 2 లక్షల 85 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  

ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సాకేత్‌ ఏడాదిన్నర తర్వాత మరో అంతర్జాతీయ డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు. సాకేత్‌ చివరిసారి 2024 నవంబర్‌లో యోకోహామా ఏటీపీ–75 చాలెంజర్‌ టోర్నీలో బెంజిమిన్‌ హసన్‌ (జర్మనీ)తో జతగా డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement