వైభవ్‌ సూర్యవంశీ ఫెయిల్‌!.. మండిపడుతున్న అభిమానులు! | IND vs NZ 2nd T20I: Vaibhav Sooryavanshi Fails 8 Ball 4 Fans Slams | Sakshi
Sakshi News home page

వైభవ్‌ సూర్యవంశీ ఫెయిల్‌!.. మండిపడుతున్న అభిమానులు!

Oct 24 2026 3:39 PM | Updated on Oct 24 2026 3:57 PM

IND vs NZ 2nd T20I: Vaibhav Sooryavanshi Fails 8 Ball 4 Fans Slams

వైభవ్‌ సూర్యవంశీ (PC: BCCI/X)

టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. జింబాబ్వే పర్యటన తర్వాత బెంచ్‌కే పరిమితమైన ఈ పదిహేనేళ్ల పిల్లాడు.. జపాన్‌లో జరిగిన ఆసియా క్రీడలు-2026 టోర్నీలో ఆడాడు.

ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అతడికి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే,  న్యూజిలాండ్‌తో శనివారం నాటి రెండో టీ20 సందర్భంగా.. వైభవ్‌కు ఎట్టకేలకు తుదిజట్టులో చోటు దక్కింది.

సరికొత్త చరిత్ర
ఈ నేపథ్యంలో కివీస్‌ గడ్డ మీద వైభవ్‌ సూర్యవంశీ సరికొత్త చరిత్ర లిఖించాడు. పురుషుల క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులోనే న్యూజిలాండ్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడే అవకాశం పొందిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.

మండిపడుతున్న అభిమానులు
అయితే, ఎట్టకేలకు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు సంపాదించిన వైభవ్‌ సూర్యవంశీ.. వచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది.

సంజూ శాంసన్‌కే పెద్ద పీట 
కివీస్‌తో రెండో టీ20లో వైభవ్‌ విఫలం కావడానికి మేనేజ్‌మెంటే కారణమని అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఓపెనింగ్‌ బ్యాటర్‌ అయిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. సంజూ శాంసన్‌కు పోటీగా జట్టులోకి వచ్చాడు. అయితే, హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ మాత్రం వరల్డ్‌కప్‌-2026 హీరో సంజూ శాంసన్‌కే పెద్ద పీట వేస్తామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాడు.

ఓపెనర్‌గా కాకుండా.. వన్‌డౌన్‌లో
అందుకు తగ్గట్లే వైభవ్‌ను వరుస మ్యాచ్‌లలో పక్కనపెట్టింది యాజమాన్యం. ఇక ఆసియా క్రీడల్లో తాత్కాలిక హెడ్‌కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ వైభవ్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించి.. సంజూను వన్‌డౌన్‌లో ఆడించాడు. అయితే, కివీస్‌తో రెండో టీ20లో మాత్రం అలా జరుగలేదు. సంజూ- అభిషేక్‌ శర్మ ఓపెనర్లుగా కొనసాగగా.. వైభవ్‌ తొలిసారి వన్‌డౌన్‌లో వచ్చాడు.

టాపార్డర్‌ విఫలం
​క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా ఈ మ్యాచ్‌లో టాపార్డర్‌ మొత్తం విఫలమైంది. సంజూ (14), అభిషేక్‌ (27) త్వరత్వరగా పెవిలియన్‌ చేరగా.. వైభవ్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. మూడో స్థానంలో వచ్చిన అతడు 8 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు చేసి.. నాథన్‌ స్మిత్‌ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

ఈ నేపథ్యంలో.. వరుస మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితం చేయడం.. న్యూజిలాండ్‌ గడ్డ మీద అదీ రెగ్యులర్‌గా ఓపెనర్‌గా కాకుండా వన్‌డౌన్‌లో పంపడం.. వంటివి వైభవ్‌ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయని.. గంభీర్‌ కావాలనే ఈ పిల్లాడిని ఇరకాటంలో పెడుతున్నాడంటూ అభిమానులు ఫైర్‌ అవుతున్నారు.

ఇక రెండో టీ20లో టాస్‌ గెలిచిన భారత్‌ కివీస్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఆతిథ్య న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే టీమిండియాకు కోలుకోలేని ఎదురుదెబ్బలు తగిలాయి.

చదవండి: IND vs NZ: తిలక్‌ వర్మ ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement