PC: X
ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫీల్డర్లలో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ ఒకడు. మైదానంలో అతడు చేసే అద్భుత ఫీల్డింగ్ విన్యాసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈసారి అతడు తన అథ్లెటిజంను ఫీల్డింగ్‌లో కాకుండా, బ్యాటింగ్ చేసే సమయంలో ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టీ20లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
గాల్లోకి సూపర్‌మేన్ డైవ్
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి బంతిని ఫిలిప్స్ ఆఫ్‌సైడ్‌లో మిడ్-ఆఫ్ దిశగా ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే రనౌట్ అయ్యే ప్రమాదం ఉండటంతో, క్రీజులోకి చేరుకోవడానికి ఫిలిప్స్ గాల్లోకి సూపర్‌మేన్‌లా డైవ్ చేశాడు. భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెరుపు వేగంతో బంతిని అందుకొని నేరుగా స్టంప్స్‌ను గిరాటేసినప్పటికీ, ఫిలిప్స్ చేసిన అద్భుతమైన డైవ్ అతడిని కాపాడింది.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి అథ్లెట్‌ను ఇప్పటివరకు చూడలేదు" అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
బ్రెండన్ మెకల్లమ్ రికార్డు బద్ధలు
ఈ మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగిన ఫిలిప్స్ కేవలం 43 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు సాధించాడు. ఈ ధనాధన్ హాఫ్ సెంచరీతో అతడు అంతర్జాతీయ టీ20ల్లో ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మాజీ దిగ్గజ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (15 హాఫ్ సెంచరీలు)ను ఫిలిప్స్ (16 హాఫ్ సెంచరీలు) అధిగమించాడు. ఈ జాబితాలో మార్టిన్ గప్టిల్ (22 హాఫ్ సెంచరీలు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్.. భువనేశ్వర్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్


