source: X
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఇవాళ రెండో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఆదిలో కాస్త తడబడినా, చివరికి కోలుకొని నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ (70) మెరుపు ఇన్నింగ్స్‌తో గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అతడికి బెవాన్ జాకబ్స్ (58) సహకరించాడు. 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. ఆఖర్లో మైఖేల్ బ్రేస్‌వెల్ (2 బంతుల్లో 10 పరుగులు) బ్యాట్ ఝులిపించాడు. మిగతా ప్లేయర్లలో టిమ్ సీఫర్ట్ 7. ఫిన్ అలెన్ 16, డారిల్ మిచెల్ 6, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 4 (నాటౌట్) పరుగులు చేశాడు.
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్‌లో 2 వికెట్లు తీయగా.. నితీశ్ కుమార్ రెడ్డి, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్ తలో వికెట్ తీశారు. అక్షర్ పటేల్ వికెట్ తీయకపోయిన పొదుపుగా బౌలింగ్ చేశాడు. భవీ (4-0-50-1) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
ఇదీ చదవండి: 1434 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన భువీ


