రీఎంట్రీపై తొలిసారి పెద‌వి విప్పిన భువ‌నేశ్వ‌ర్‌ | Bhuvneshwar Kumar Opens Up On His India Comeback After Four Years, New Zealand Tour And RCB Back To Back IPL Titles, Read Story Inside | Sakshi
Sakshi News home page

రీఎంట్రీపై తొలిసారి పెద‌వి విప్పిన భువ‌నేశ్వ‌ర్‌

Oct 24 2026 1:35 PM | Updated on Oct 24 2026 1:56 PM

Bhuvneshwar-1st-Reaction-After-4 Years-Comeback For Team India Vs NZ

Photo Credit: BCCI Twitter

టీమిండియా వెట‌ర‌న్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ నాలుగేళ్ల త‌ర్వాత అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. 2022లో ఆఖ‌రి మ్యాచ్ ఆడిన భువీ మ‌ళ్లీ నాలుగేళ్ల త‌ర్వాత న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక‌య్యాడు. అంత‌క‌ముందు విండీస్‌తో జ‌రిగిన చివ‌రి టీ20లోనూ భువ‌నేశ్వ‌ర్ ఆడాడు. 

ఇక కివీస్‌తో తొలి టీ20లో ఆడిన భువ‌నేశ్వ‌ర్ 4 ఓవ‌ర్లు వేసి 49 ప‌రుగులిచ్చి ఒక్క వికెట్ తీయ‌లేక‌పోయాడు. అయితే జ‌ట్టు మేనేజ్‌మెంట్ అత‌డిపై న‌మ్మ‌క‌ముంచి రెండో టీ20లోనూ భువ‌నేశ్వ‌ర్‌కు మ‌రో అవ‌కాశమిచ్చింది. ఈ నేప‌థ్యంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు భువ‌నేశ్వ‌ర్ త‌న రీఎంట్రీపై తొలిసారి పెద‌వి విప్పాడు. 

భువ‌నేశ్వ‌ర్ మాట్లాడుతూ.. ‘‘టీమిండియా త‌ర‌ఫున రీఎంట్రీ ఇవ్వ‌డం సంతోషంగా ఉంది. జాతీయ జ‌ట్టు జెర్సీ ధ‌రించి అంత‌ర్జాతీయ మ్యాచ్ ఆడ‌డాన్ని ఆస్వాదిస్తున్నా. అయితే జ‌ట్టులోకి రావ‌డానికి ఏదైతే చేయాలో అదే చేశాను. అందుకోసం దేశ‌వాళీ క్రికెట్‌లో చాలా మ్యాచ్‌లు ఆడాను. నిజం చెప్పాలంటే, నేను పునరాగమనం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అదృష్ట‌వ‌శాత్తూ నాకు ఇదంతా ఒక వ‌ల‌యం (స‌ర్కిల్‌)లా అనిపించింది.

ఎందుకంటే న్యూజిలాండ్ ప‌ర్య‌టనే నా చివ‌రి విదేశీ టూర్‌. తాజాగా నాలుగేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లు ఆడుతుండ‌డం యాదృశ్చికమ‌ని చెప్పొచ్చు. ఇక సొంత‌గ‌డ్డ‌పై న్యూజిలాండ్ బ్యాట‌ర్లు దూకుడుగా ఆడుతారు. ఫిన్ అలెన్‌, టిమ్ సీఫెర్ట్ వంటి బ్యాట‌ర్లు ఎలా ఆడ‌తార‌న్న‌ది నాకు ఒక అవ‌గాహ‌న ఉంది. వారిని ఔట్ చేసేందుకు కొన్ని ప్ర‌ణాళిక‌లు వేసుకున్నా.’’ అని చెప్పుకొచ్చాడు.

ఇక ఐపీఎల్‌లో రెండు వ‌రుస సీజ‌న్ల‌లో ఆర్సీబీ చాంపియ‌న్స్‌గా నిల‌వ‌డంపై భువ‌నేశ్వ‌ర్‌కు ప్ర‌శ్న ఎదురైంది. దీనిపై భువీ స్పందిస్తూ.. ‘‘నా రెండు వ‌రుస ఐపీఎల్ సీజ‌న్ల‌లో ఆర్సీబీ టైటిల్ సాధించ‌డం గొప్ప విష‌యం. అయితే ఆ జ‌ట్టులో నేను అడుగుపెట్టినప్పుడు నా మీద నాకు జీరో ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేవి. నా నుంచి నేను ఏమీ ఆశించలేదు. 

అలా అని ప్రాక్టీస్ చేయలేదని కాదు. నేను పక్కాగా ప్రిపేర్ అయ్యాను, సిద్ధమవడానికి ఏమేం కావాలో అవన్నీ చేశాను. నేను నాలుగు సంవత్సరాలు టీమిండియా జెర్సీకి దూర‌మైన‌ప్ప‌టికీ, ఎప్పుడూ దానికోసం వెంపర్లాడలేదు. అందుకే ఆ నాలుగు ఏళ్లు ఎలా గడిచిపోయాయో కూడా నాకు తెలియలేదు. ఒక ఆటగాడిగా నేను చాలా మెరుగయ్యాను. ఐపీఎల్ (IPL) చాలా కీలక పాత్ర పోషించిందని నేను భావిస్తున్నాను’’ అని తెలిపాడు.

2012లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన భువ‌నేశ్వ‌ర్ కుమార్ టీమిండియా త‌ర‌ఫున 21 టెస్టుల్లో 63 వికెట్లు, 121 వ‌న్డేల్లో 141 వికెట్లు, 89 టీ20ల్లో 90 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement