సంజూ శాంసన్ (PC: BCCI)
‘ప్రతిభ ఉన్నా... ఆటలో నిలకడలేదు.. రెండు మ్యాచ్‌లు ఆడితే.. నాలుగు మ్యాచ్‌లలో తేలిపోతాడు’... టీమిండియా టీ20 ఓపెనర్ సంజూ శాంసన్‌పై తరచూ వచ్చే విమర్శలు. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఆట కూడా అందుకు తగ్గట్లుగానే ఉంటుంది.
వరల్డ్‌కప్ హీరో.. ఆ తర్వాత
టీ20 ప్రపంచకప్-2026 నాకౌట్ దశలో దుమ్ములేపిన సంజూ.. ఆ తర్వాత వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు. ఇటీవల స్వదేశంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లోనూ నిలకడగా రాణించలేకపోయాడు. అయితే, న్యూజిలాండ్ పర్యటనను మాత్రం సంజూ ఘనంగా ఆరంభించాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
కివీస్ జట్టుతో క్రైస్ట్‌చర్చ్ వేదికగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో మెరుపు అర్ధ శతకం (33 బంతుల్లో 67)తో అదరగొట్టి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు సంజూ. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై సంజూ శాంసన్ స్పందించాడు.
అంత ఈజీ ఏం కాదు
‘‘నిజాయితీగా చెప్పాలంటే.. సోషల్ మీడియాలో ప్రజలు ఏమంటున్నారు? మన పట్ల ఇతరుల ప్రవర్తన ఎలా ఉంది? ఇలాంటి విషయాలు పట్టించుకుంటే ముందుకు సాగలేము. నిబద్ధతతో మన పని చేసుకుంటూ వెళ్లాలి. మన చుట్టూ సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
వాళ్లు తప్పు అని నిరూపించేందుకు ఆడను
టీమిండియా తరఫున క్రికెట్ ఆడటం అంత తేలికైన విషయం కాదు. ఇక్కడ చాలా మంది విమర్శకులు ఉంటారు. ఎవరి అభిప్రాయం వాళ్లకు ఉంటుంది. అయితే, నన్ను విమర్శించిన వాళ్లు తప్పు అని నిరూపించేందుకు మాత్రం నేను గొప్పగా ఆడాలనుకోను.
అన్నింటికంటే నాకు క్రికెట్ ముఖ్యం. ఎలా ముందుకు వెళ్లాలన్న అంశం గురించే ఎల్లప్పుడూ ఆలోచిస్తాను. ప్రాక్టీస్ చేస్తాను. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తాను. ఏ విషయాన్ని సంక్లిష్టంగా మార్చాలనుకోను.
నా నియంత్రణలో ఉన్న విషయాల మీద మాత్రమే దృష్టి పెడతాను. ఇతరుల అభిప్రాయాలు నాపై ప్రభావం చూపలేవు’’ అని సంజూ శాంసన్ తనను విమర్శిస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఆట మీద మాత్రమే తన దృష్టి ఉంటుందని స్పష్టం చేశాడు.
చదవండి: 'ఆరోజు బౌండరీ కర్వ్‌గా ఉంది.. లేదంటే ట్రోఫీ మాదే!'


