వరల్డ్‌కప్-2023 ఫైనల్ చేరిన ఆనందంలో రోహిత్ ( ఫైల్ ఫొటో PC: BCCI)
టీమిండియా దిగ్గజ కెప్టెన్లలో ఒకడిగా పేరొందాడు రోహిత్ శర్మ. అతడి సారథ్యంలో భారత్ 2024లో టీ20 ప్రపంచకప్ గెలవడంతో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను కూడా కైవసం చేసుకుంది.
నాడు ప్రపంచకప్ జట్టులో దక్కని చోటు
ఒకప్పుడు వన్డే ప్రపంచకప్ (2011) జట్టులోనే చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత లెజెండరీ బ్యాటర్‌గా ఎదిగి.. 2023 వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్లో కెప్టెన్‌గా జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఇక 2024 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన హిట్‌మ్యాన్.. గతేడాది టెస్టులకు వీడ్కోలు పలకాల్సి వచ్చింది.
ఫామ్‌లేమి, వరుస పరాజయాల నేపథ్యంలో రోహిత్ శర్మ సంప్రదాయ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. అదే విధంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలిపిన తర్వాతి సిరీస్‌లోనే అతడిని కెప్టెన్‌గా తొలగించింది యాజమాన్యం. ఈ పరిణామాలకు అప్పటి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కారణమనే విమర్శలు వచ్చాయి.
విలన్‌గా అగార్కర్!
అంతేకాదు కేవలం వన్డేల్లో కొనసాగుతూ.. ప్రపంచకప్-2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్‌కు అగార్కర్ పదే పదే అడ్డుతగిలాడని వార్తలు వచ్చాయి. ఇటీవల ఇంగ్లండ్‌లో లార్డ్స్ మ్యాచ్ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించేలా సెలక్షన్ కమిటీ ఒత్తిడి చేసిందనే ఊహాగానాలు రాగా.. బీసీసీఐ పెద్దలు మాత్రం అతడికి అండగా నిలిచారు.
ఈ క్రమంలో అగార్కర్ తన పదవిని కోల్పోగా.. సెంచరీలు బాదుతూ ఫామ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ కెరీర్‌లో మరో వన్డే వరల్డ్‌కప్ ఆడేందుకు సిద్ధమైపోయాడు. ఇటీవల స్వదేశంలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో శతక్కొట్టిన హిట్‌మ్యాన్.. తాజాగా రెడిఫ్‌తో మాట్లాడుతూ తన కెరీర్‌లోనే అత్యంత కఠిన దశ గురించి వివరించాడు.
నా కెరీర్‌లో అత్యంత కఠిన దశ అదే
‘‘2007 నుంచి ఇప్పటి దాకా నా కెరీర్‌లో అత్యంత కఠిన దశ.. 2023 వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమి. నేను ఇంతవరకు ఇంతటి చేదు అనుభవాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు. టోర్నీ ఆసాంతం మేము అద్భుతంగా ఆడాము. అసలు ఫైనల్లో ఓడిపోతామన్న ఆలోచన కూడా లేదు.
కానీ ఆటలోని అసలు గమ్మత్తు అదే. అన్నీ బాగున్నాయి.. అంతా సజావుగా సాగుతోంది అనుకుంటున్న సమయంలోనే మనల్ని వెనక్కి లాగుతుంది. గుణపాఠాలు నేర్పుతుంది. అయితే, మళ్లీ గెలిచి తీరాలన్న కసిని కూడా మనలో నింపుతుంది.
ప్రతీ నవంబరు 19 తర్వాత జూన్ 29 ఉంటుంది
2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమి తర్వాత జట్టు మరింత పట్టుదలగా పోరాడింది. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి అన్న మాటకు తావు లేకుండా గెలిచి నిలిచింది.
గెలుపు కంటే కూడా ఒక్కోసారి ఓటమే మనకు గొప్ప పాఠాల్ని నేర్పుతుంది. ప్రతీ నవంబరు 19 (2023 వన్డే వరల్డ్‌కప్ ఓటమి) తర్వాత జూన్ 29 (టీ20 ప్రపంచకప్ గెలుపు) ఉంటుందనే ఆశాభావాన్ని నింపుతుంది’’ అని రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో భారత్.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
చదవండి: అప్పుడు ఐదు ఎకరాల భూమి.. ఇప్పుడు 3 ఖరీదైన అపార్టుమెంట్లు కొన్న విరుష్క


