
టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) టోర్నీల్లోనూ భారత్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.
కాగా సరిహద్దు వివాదాల నేపథ్యంలో టీమిండియా-పాకిస్తాన్ (IND vs PAK) మధ్య పుష్కర కాలంగా ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరగడం లేదన్న విషయం తెలిసిందే.. అయితే ఐసీసీ టోర్నీలలో మాత్రం ఇరు జట్లూ తలపడుతున్నాయి.
ఇప్పుడు దీనికి కూడా ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. భారత్, పాక్ సరిహదుల్లో తీవ్రవాదం ముగిసేవరకు ఇరు జట్ల మధ్య ఆటలకు ప్రాధాన్యత లేదని అతను అన్నాడు.
అప్పటిదాకా ఎలాంటి ఆటలు అవసరం లేదు
ఈ విషయంలో బీసీసీఐ మాత్రమే కాదు, భారత ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గంభీర్ వ్యాఖ్యానించాడు. ‘నా అభిప్రాయం ప్రకారం ఇరు దేశాల మధ్య పరిస్థితులు మెరుగుపడే వరకు అసలు ఎలాంటి ఆటలు అవసరం లేదు.
గతంలోనూ ఈ అభిప్రాయాన్ని వెల్లడించాను. నా దృష్టిలో క్రికెట్ మ్యాచ్, బాలీవుడ్ సినిమాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలేవీ భారత సైనికులు లేదా భారత పౌరుల ప్రాణాలకంటే ముఖ్యం కాదు. మ్యాచ్‌లు జరుగుతుంటాయి.
సినిమాలు వస్తూ పోతూ ఉంటాయి. గాయకులు వేదికలపై పాడుతూనే ఉంటారు. కానీ మీ ఆత్మీయులను కోల్పోయిన బాధను ఏదీ తగ్గించలేదు’’ అని గంభీర్ ఉద్వేగభరితంగా మాట్లాడాడాడు.
ఆసియా కప్ గురించి చెప్పలేను
అదే విధంగా.. ‘‘ఈ ఏడాది జరిగే ఆసియా కప్ గురించి నేను ఏమీ చెప్పలేను. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం. వారు ఏం చెబితే దానిని పాటిస్తాం’ అని గంభీర్ స్పష్టం చేశాడు.
కాగా ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు పాశవిక దాడికి తెగబడిన విషయం విదితమే. బైసరన్ లోయలో పర్యాటకులపై కాల్పులు జరిపి ఇరవై ఆరు మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా అనేక ఆంక్షలు విధించింది.
ఆపరేషన్ సింధూర్
తాజాగా ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లో నాలుగు, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఐదు ప్రాంతాల్లో భారత సైన్యం దాడులకు దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఇంటెలిజెన్స్ వర్గాల సహకారంతో భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు డ్రోన్లు, ఇతర ఆయుధాలు వాడినట్లు భారత భద్రతా వర్గాలు పేర్కొన్నాయి.
చదవండి: Virat Kohli: అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకొన్నా