కోల్‌కతా వేదికగా నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాలో కీలక మార్పు చోటు చేసుకుంది. యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని జట్టు నుంచి విడుదల చేశారు.
నవంబర్ 13 నుంచి 19 మధ్యలో సౌతాఫ్రికా-ఏతో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాల్గొనాలని ఆదేశించారు. నవంబర్ 22 నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్ట్ సమయానికి తిరిగి సీనియర్ జట్టులో చేరతాడని పేర్కొన్నారు.
నితీశ్‌ను భవిష్యత్ విదేశీ పర్యటనల కోసం సిద్దం చేస్తున్నామని బీసీసీఐ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో నితీశ్ ఖంగుతిన్నాడు. నితీశ్‌కు ఈ పరిస్థితి రావడానికి సరైన అవకాశాలు రాకపోవడం ఓ కారణమైతే, ధృవ్ జురెల్ ఫామ్ మరో కారణం.
పంత్ గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన జురెల్ జట్టులో స్థిరపడిపోయాడు. ఇటీవల విండీస్‌పై సెంచరీతో పాటు తాజాగా సౌతాఫ్రికా-ఏపై ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేశాడు. మరోపక్క గాయం నుంచి కోలుకున్న పంత్ జట్టులోకి వచ్చాడు. అతను కూడా పూర్వపు ఫామ్‌ను కొనసాగించాడు. దీంతో సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో పంత్, జురెల్ ఇద్దరిని ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితుల్లో ఎవరిపై వేటు వేయాలని ఆలోచిస్తే మేనేజ్‌మెంట్‌కు నితీశ్ కుమార్ రెడ్డి మొదటి ఆప్షన్ అయ్యాడు. నితీశ్ తాజాగా విండీస్‌తో జరిగిన సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో ఆడినా రెండు విభాగాల్లో (బ్యాటింగ్, బౌలింగ్) సరైన అవకాశాలు రాలేదు.
తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రెండో ఇన్నింగ్స్‌లో నితీశ్‌కు బంతినే ఇవ్వలేదు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ అవకాశం రాగా, దానికి నితీశ్ న్యాయం చేశాడు.
అప్పటికే భారత్ భారీ స్కోర్ చేయగా.. నితీశ్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 43 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో నితీశ్‌కు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. విండీస్ స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించడంతో నితీశ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
చదవండి: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ఆటగాడు..!


