ఐపీఎల్ 2026కి ముందు సంచలన ట్రేడ్ డీల్ జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను దక్కించుకునేందుకు ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా, సామ్ కర్రన్‌ను వదులుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.
ఈ మేరకు ఫార్మాలిటీస్ కూడా పూర్తైనట్లు సమాచారం. డీల్‌లో భాగంగా సంజూ సీఎస్‌కేలో చేరేందుకు.. జడేజా, కర్రన్ రాయల్స్‌లో తరఫున ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశారట.
అయితే చివరి నిమిషంలో రవీంద్ర జడేజా ఓ మెలిక పెట్టినట్లు ఐపీఎల్ వర్గాలు అంటున్నాయి. రాయల్స్‌లో చేరితే తనకు కెప్టెన్సీ ఇవ్వాలని జడ్డూ కండీషన్ పెట్టాడట. ఇందుకు రాయల్స్ యాజమాన్యంలోని కొందరు అంగీకరించినప్పటికీ.. ఓ కీలక వ్యక్తి అడ్డు పడినట్లు సమాచారం.
సంజూ ఫ్రాంచైజీని వీడాలనుకున్నప్పుడు సదరు వ్యక్తి అప్పటికే జట్టులో ఉన్న ఇద్దరి పేర్లను కెప్టెన్సీ కోసం పరిశీలిస్తానని మాట ఇచ్చాడట. ఇప్పుడు కొత్తగా జడ్డూ కెప్టెన్సీ కోసం డిమాండ్ చేయడంతో యాజమాన్యంలో భేదాభిప్రాయాలు వచ్చాయని సమాచారం. ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతే సీఎస్‌కేతో ట్రేడ్ డీల్ క్యాన్సల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.
కాగా, సంజూ రాయల్స్‌ను వీడే విషయం ఖరారైన తర్వాత యాజమాన్యం ధృవ్ జురెల్, యశస్వి జైస్వాల్ పేర్లను కెప్టెన్సీ కోసం పరిశీలిస్తుంది. గత సీజన్‌లో సంజూ గైర్హాజరీలో రియాన్ పరాగ్ నాయకుడిగా వ్యవహరించినా.. అతని పేరు ప్రస్తావనకు రాలేదు. కొత్తగా జడేజా పేరు తెరపైకి రావడంతో రాయల్స్ యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఐపీఎల్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
జడ్డూ ప్రొఫైల్‌ని బట్టి చూస్తే.. రాయల్స్ కెప్టెన్‌గా నియమించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే అతని ఐపీఎల్ కెరీర్ ఈ ఫ్రాంచైజీతోనే మొదలైంది. అతనికి ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా ఉంది. పైగా ఇటీవలికాలంలో అతను టీమిండియా విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించాడు.
సంజూ విషయానికొస్తే.. డీల్ కుదిరి అతను సీఎస్‌కేలో చేరినా కెప్టెన్సీ దక్కే అవకాశం మాత్రం లేదు. సీఎస్‌కేలో సంజూ సాధారణ ఆటగాడిగా కొనసాగాల్సి ఉంటుంది. రుతురాజ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించే యోచనలో సీఎస్‌కే యాజమాన్యం లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది.
పై విషయాలపై క్లారిటీ రావాలంటే నవంబర్ 15 వరకు వేచి చూడాల్సిందే. ఆ రోజులోపు ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాల్సి ఉంది.
చదవండి: ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్


