భారత్-న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచి (జనవరి 21) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. నాగ్‌పూర్ వేదికగా జరుగబోయే తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఎలా ఉండబోతుందో అనే దానిపై ఓ అంచనా వేద్దాం. ప్రపంచకప్‌కు ముందు జరుగబోయే చివరి సిరీస్ కావడంతో ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ అన్ని కాంబినేషన్లను పరీక్షించే అవకాశం ఉంది.
ఓపెనర్లుగా టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే బరిలోకి దిగడం లాంఛనమే. వీరిలో రాబిన్సన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కాన్వే టీ20 ఫామ్ కాస్త కలవరపెడుతున్నా, ఇతర ఫార్మాట్లలో మంచి టచ్‌లో ఉండటం ఊరట కలిగించే అంశం. ఫస్ట్ ఛాయిస్ వికెట్‌కీపర్ కావడంతో తుది జట్టులో కాన్వే స్థానం పక్కా.
వన్‌డౌన్‌లో రచిన్ రవీంద్ర రావడం కూడా దాదాపుగా ఖాయమే. రచిన్‌కు ఈ స్థానంలో మంచి రికార్డు ఉంది. 14 మ్యాచ్‌ల్లో 143.81 స్ట్రయిక్‌రేట్‌తో 325 పరుగులు చేశాడు. స్పిన్ బౌలర్లపై ఎదురుదాడి చేయగల సమర్దత రచిన్‌ను ఈ స్థానానికి ఫిక్స్ చేస్తుంది.
న్యూజిలాండ్ మిడిలార్డర్‌లో చాలా పటిష్టంగా ఉంది. ఇక్కడ ఆ జట్టుకు ఎలాంటి ప్రయోగాలు చేయాల్సిన అవసరం రాదు. నాలుగో స్థానంలో డారిల్ మిచెల్, ఆతర్వాత మార్క్ చాప్‌మన్, మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి బలమైన హిట్టర్లు, ఆల్‌రౌండర్లు ఉన్నారు. సమయానుసారంగా వీరి స్థానాల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.
లోయర్ ఆర్డర్ విషయానికొస్తే.. ఇక్కడ కూడా దాదాపు అన్ని బెర్త్‌లు ఖరారై ఉన్నాయి. స్పెషలిస్ట్ స్పిన్నర్ కమ్ బ్యాటర్‌గా మిచెల్ సాంట్నర్ ఏడు లేదా ఎనిమిది స్థానాల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో సాంట్నర్ భారత బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేయవచ్చు. సాంట్నర్‌కు భారత్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ అతను ఆడిన 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు.
న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ విభాగం మిగతా విభాగాల కంటే అత్యంత పటిష్టంగా ఉంది. గతేడాది ఫార్మాట్లకతీతంగా చెలరేగిన మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ తుది జట్టులో ఉంటారు. వీరికి మరో ఇన్ ఫామ్ పేసర్ కైల్ జేమీసన్ జత కలుస్తాడు. ఈ ముగ్గురితో కివీస్ పేస్ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది.
ఐష్ సోది డౌటే..!
భారత్‌పై ఐష్ సోధికి అద్భుత రికార్డు (20 మ్యాచ్‌లు, 25 వికెట్లు, ఎకానమీ 7.54) ఉన్నా, జట్టు కాంబినేషన్ కారణంగా తొలి మ్యాచ్‌లో అతనికి ఆడే అవకాశం రాకపోవచ్చు. సాంట్నర్‌తో పాటు రవీంద్ర, బ్రేస్‌వెల్, చాప్‌మన్, ఫిలిప్స్ స్పిన్ ఆప్షన్లుగా అందుబాటులో ఉన్నారు.
భారత్‌తో తొలి టీ20కి న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా): మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మార్క్ చాప్‌మన్, టిమ్ రాబిన్సన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ, కైల్ జేమీసన్.


