Neeraj Chopra Classic 2025: మరో స్టార్‌ అవుట్‌ | Neeraj Chopra Classic 2025: Anderson Peters pulls out from tournament | Sakshi
Sakshi News home page

Neeraj Chopra Classic 2025: మరో స్టార్‌ అవుట్‌

Jul 2 2025 4:54 PM | Updated on Jul 2 2025 4:54 PM

Neeraj Chopra Classic 2025: Anderson Peters pulls out from tournament

బెంగళూరు: భారత్‌లో జరగనున్న తొలి అంతర్జాతీయ జావెలిన్‌ త్రో ఈవెంట్‌... ‘నీరజ్‌ చోప్రా క్లాసిక్‌’ నుంచి  ప్రపంచ చాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనడా) వైదొలిగాడు. మడమ గాయం కారణంగా 27 ఏళ్ల పీటర్స్‌ ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. ఇప్పటికే పలువురు జావెలిన్‌ త్రోయర్లు ఈ ఈవెంట్‌కు దూరం కాగా... ఇప్పుడు ఆ జాబితాలో పీటర్స్‌ కూడా చేరాడు. ఇక 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన పీటర్స్‌ స్థానాన్ని పోలాండ్‌కు చెందిన సిప్రియన్‌ మ్రిగ్లాడ్‌ భర్తీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

‘పీటర్స్‌ గాయం కారణంగా ‘నీరజ్‌ చోప్రా క్లాసిక్‌’ ఈవెంట్‌కు దూరమయ్యాడు. అతడి స్థానాన్ని పోలాండ్‌కు చెందిన అథ్లెట్‌ సిప్రియన్‌ భర్తీ చేస్తాడు’ అని వెల్లడించారు. అండర్‌ 23 యూరోపియన్‌ మాజీ చాంపియన్‌ అయిన సిప్రియన్‌ అత్యుత్తమ ప్రదర్శన 84.97 మీటర్లు. శనివారం బెంగళూరు వేదికగా జరగనున్న నీరజ్‌ చోప్రా క్లాసిక్‌ ఈవెంట్‌కు అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య ‘ఎ’ కేటగిరీ గుర్తింపునిచ్చింది.

మొత్తం 12 మంది జావెలిన్‌ త్రోయర్లు పాల్గొంటున్న ఈ ఈవెంట్‌లో భారత్‌ నుంచి ఐదుగురు అథ్లెట్లు పోటీలో ఉన్నారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఇప్పటికే ముగ్గురు ప్లేయర్లు టోర్నీకి దూరం కాగా... వారి స్థానాల్లో ఇతరులను ఎంపిక చేశారు. భారత త్రోయర్‌ కిషోర్‌ జెనా గాయం కారణంగా ఈ ఈవెంట్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో యశ్‌వీర్‌సింగ్‌ బరిలోకి దిగనున్నాడు. జెన్కీ డీన్‌ (జపాన్‌) స్థానాన్ని మార్టిన్‌ కొనెస్నీ (పోలాండ్‌)తో భర్తీ చేశారు.

ఈ టోర్నీలో నీరజ్‌ చోప్రాతో పాటు అంతర్జాతీయ స్టార్లు జూలియస్‌ యెగో (కెన్యా), థామస్‌ రహ్లెర్‌ (జర్మనీ), సిప్రియన్‌ మ్రిగ్లాడ్, మార్టిన్‌ కొనెస్నీ, కర్టీస్‌ థాంప్సన్‌ (అమెరికా), లూయిస్‌ మౌరిసియో డా సిల్వా (బ్రెజిల్‌), రమేశ్‌ పతిరగె (శ్రీలంక) పాల్గొననున్నారు. భారత్‌ నుంచి నీరజ్‌తోపాటు సచిన్‌ యాదవ్, రోహిత్‌ యాదవ్, సాహిల్, యశ్‌వీర్‌ సింగ్‌ బరిలోకి దిగనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement