నందిని, జ్యోతి యర్రాజీలకు స్వర్ణ పతకాలు | Nandini and Jyoti Yarraji win gold medals in Athletics Championship | Sakshi
Sakshi News home page

నందిని, జ్యోతి యర్రాజీలకు స్వర్ణ పతకాలు

Apr 23 2025 2:47 AM | Updated on Apr 23 2025 2:47 AM

Nandini and Jyoti Yarraji win gold medals in Athletics Championship

జాతీయ ఫెడరేషన్‌ కప్‌ సీనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. కొచ్చిలో జరుగుతున్న ఈ మీట్‌లో మంగళవారం మహిళల హెప్టాథ్లాన్‌ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన అగసార నందిని పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు, లాంగ్‌జంప్, జావెలిన్‌ త్రో, 800 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్‌లో నందిని మొత్తం 5813 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. పూజ (హరియాణా; 5401 పాయింట్లు) రజతం, మౌమిత మండల్‌ (రిలయన్స్‌; 5373 పాయింట్లు) కాంస్యం సాధించారు. 

మరోవైపు మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జ్యోతి యర్రాజీ బంగారు పతకాన్ని దక్కించుకుంది. రిలయెన్స్‌ జట్టు తరఫున బరిలోకి దిగిన జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసును 13.23 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. విజేతగా నిలిచే క్రమంలో జ్యోతి ఆసియా చాంపియన్‌షిప్‌ అర్హత ప్రమాణ సమయాన్ని (13.26 సెకన్లు) కూడా అధిగమించింది.   

Advertisement
 
Advertisement
Advertisement