పసికూన.. ‘ప్రపంచ రికార్డు’! | NAM vs SA: Namibia Creates History Become 1st Associate Team To | Sakshi
Sakshi News home page

పసికూన.. ‘ప్రపంచ రికార్డు’!

Aug 29 2026 12:46 PM | Updated on Aug 29 2026 1:00 PM

NAM vs SA: Namibia Creates History Become 1st Associate Team To

PC: ICC X

సొంతగడ్డపై నమీబియా క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో సౌతాఫ్రికాను రెండుసార్లు ఓడించిన ఏకైక అసోసియేట్‌ జట్టుగా నిలిచింది. కాగా నమీబియా.. సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లతో ముక్కోణపు టీ20 సిరీస్‌ ఆడుతోంది.

ఇందులో భాగంగా విండ్‌హోక్‌ నమీబియా- సౌతాఫ్రికా మధ్య మ్యాచ్‌తో శుక్రవారం ఈ సిరీస్‌కు తెరలేచింది. నమీబియా క్రికెట్‌ గ్రౌండ్‌లో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన నమీబియా.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 163 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.

ఓపెనర్ల ధనాధన్‌
టాపార్డర్‌లో ఓపెనర్లు లూరేన్‌ స్టీన్‌కాంప్‌ (29 బంతుల్లో 41), జాన్‌ ఫ్రిలింక్‌ (38 బంతుల్లో 60) ఆకట్టుకోగా.. కెప్టెన్‌, వన్‌డౌన్‌ బ్యాటర్‌ గెర్హాడ్‌ ఎరాస్మస్‌ 19 పరుగులు చేయగలిగాడు. మిగిలిన వారిలో అలెగ్జాండర్‌ విలోషెంక్‌ (13*), రూబెల్‌ ట్రంపెల్‌మాన్‌ (12) మాత్రమే పది పరుగుల మార్కు దాటగా.. మిగతా అందరూ సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

సౌతాఫ్రికా బౌలర్లలో ప్రెనేలన్‌ సుబ్రేయాన్‌ మూడు వికెట్లతో మెరవగా.. కెప్టెన్‌ బిజోర్న్‌ ఫార్చూన్‌, అరంగేట్ర ఆటగాడు డువాన్‌ యాన్సెన్‌ తలా రెండు.. నకొబాని మొకోనా, డెవాల్డ్‌ బ్రెవిస్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి.. 145 పరుగులకే పరిమితమైంది. డెవాల్డ్‌ బ్రెవిస్‌ ఒంటరి పోరాటం (50 బంతుల్లో 75) వృథాగా పోయింది.

తొలి జట్టుగా చరిత్ర..
టీ20 ప్రపంచకప్‌-2022 సందర్భంగా నెదర్లాండ్స్‌ జట్టు సౌతాఫ్రికాను ఓడించింది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో సౌతాఫ్రికాపై గెలిచిన తొలి అసోసియేట్‌ జట్టుగా నెదర్లాండ్స్‌ నిలిచింది. అయితే, 2025లో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో నమీబియా సౌతాఫ్రికాను తొలిసారి ఓడించి నెదర్లాండ్స్‌ తర్వాతి స్థానంలో నిలిచింది. తాజాగా మరోసారి ప్రొటిస్‌ జట్టుపై గెలిచి (16 పరుగుల తేడాతో).. రెండుసార్లు ఈ ఘనత సాధించిన తొలి అసోసియేట్‌ జట్టుగా ప్రపంచ రికార్డు సాధించింది.

ఫైనల్‌ చేరతాం.. గెలుస్తాం
టీ20 ట్రై సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాపై తొలి మ్యాచ్‌లో గెలుపొందడంపై నమీబియా కెప్టెన్‌ గెర్హాడ్‌ ఎరాస్మస్‌ హర్షం వ్యక్తం చేశాడు. రెండోసారి తాము ఈ పని చేశామని.. ఇదేమీ గాలివాటం విజయం కాదన్నాడు. యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారని.. ప్రతి ఒక్కరు తమ బాధ్యతను చక్కగా నెరవేరుస్తున్నారని ప్రశంసించాడు. ఈ సౌతాఫ్రికా- నమీబియా సిరీస్‌లో ఫైనల్‌ చేరి.. టైటిల్‌ గెలవడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. 

చదవండి: సూర్యకుమార్‌ యాదవ్‌ ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement