IND vs ENG T20: ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన భారత్‌ | Indian Team Beat England 118 Runs T20 recreates Ganguly Lords celebration | Sakshi
Sakshi News home page

IND vs ENG T20: ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన భారత్‌

Aug 20 2026 1:19 PM | Updated on Aug 20 2026 1:46 PM

Indian Team Beat England 118 Runs T20 recreates Ganguly Lords celebration

Photo Credit: dcciofficial X

ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ఇండియన్‌ మిక్స్‌డ్‌ డిజెబిలిటి క్రికెట్‌ జట్టు అద్భుత విజయం సాధించింది. ‘క్రికెట్‌ పుట్టినిల్లు’గా భావించే స్టేడియంలో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టును ఏకంగా 118 పరుగుల తేడాతో మట్టికరిపించింది.

ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ మాదిరి లార్డ్స్‌ బాల్కనీలో షర్టు విప్పేసి ఆటగాళ్లు సెలబ్రేట్‌ చేసుకుంటూ.. ఐకానిక్‌ మూమెంట్‌ను రిపీట్‌ చేశారు. కాగా ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడేందుకు భారత పురుషుల దివ్యాంగ జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది.

కెప్టెన్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌
ఇందులో భాగంగా ఇంగ్లండ్‌ నాలుగు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ సొంతం చేసుకోగా.. భారత్‌ రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య లార్డ్స్‌ వేదికగా బుధవారం నామమాత్రపు ఏడో టీ20 జరగగా.. భారత బ్యాటర్లు దుమ్ములేపారు.

ఫలితంగా భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 206 పరుగులు సాధించింది. కెప్టెన్‌ మజీద్‌ మాగ్రే కేవలం 19 బంతుల్లోనే 63 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. అర్జున్‌ గవ్రే 44 బంతుల్లో 68 పరుగులతో రాణించాడు. అనంతరం ఇంగ్లండ్‌ లక్ష్య ఛేదనకు దిగగా.. భారత బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.

88 పరుగులకే ఇంగ్లండ్‌ ఆలౌట్‌
దీంతో ఇంగ్లండ్‌ దివ్యాంగ జట్టు కేవలం 88 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో హిలాల్‌ అహ్మద్‌ వనీ నాలుగు వికెట్లు కూల్చగా.. జయేశ్‌ పర్మార్‌ మూడు వికెట్లు పడగొట్టి.. ఇంగ్లండ్‌ను ఆలౌట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక లార్డ్స్‌ విజయంతో భారత్‌ ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఆధిక్యాన్ని 4-3కి తగ్గించగలిగింది.

గంగూలీ మాదిరి సెలబ్రేషన్‌
ఇదిలా ఉంటే.. లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌పై గెలుపొందగానే భారత జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. సహాయక సిబ్బంది, ఆటగాళ్లు కలిసి ఈ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి షర్టు విప్పేసి.. గంగూలీ ఐకానిక్‌ లార్డ్స్‌ మూమెంట్‌ను  రిపీట్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత దివ్యాంగ క్రికెట్‌ మండలి సోషల్ మీడియాలో షేర్‌ చేయగా.. వైరల్‌గా మారింది.

కాగా ఇంగ్లండ్‌- ఇండియా- శ్రీలంక మధ్య ముక్కోణపు వన్డే సిరీస్‌ నాట్‌వెస్ట్‌ ట్రోఫీ ఫైనల్‌-2002 ఫైనల్లో.. భారత్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. లార్డ్స్‌లో జరిగిన టైటిల్‌ పోరులో గంగూలీ సారథ్యంలోని టీమిండియా ఇంగ్లండ్‌ను రెండు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో బాల్కనీలో గంగూలీ షర్టు విప్పేసి గాల్లో ఊపుతూ సంబరాలు చేసుకున్నాడు. 

చదవండి: దంచికొట్టిన సెహ్వాగ్‌ కుమారుడు.. వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement