IND vs WI: ‘గంభీర్‌ను కాదనైనా సరే శ్రేయస్‌ నిర్ణయం తీసుకోవాలి’ | Shreyas should take that call EX IND batter strong Statement IND vs WI T20Is | Sakshi
Sakshi News home page

IND vs WI: ‘గంభీర్‌ను కాదనైనా సరే శ్రేయస్‌ నిర్ణయం తీసుకోవాలి’

Oct 3 2026 9:58 AM | Updated on Oct 3 2026 10:45 AM

Shreyas should take that call EX IND batter strong Statement IND vs WI T20Is

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి ఇప్పుడే చర్చ మొదలైంది. ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20లకు సెప్టెంబరు 27- అక్టోబరు 17 మధ్య షెడ్యూల్‌ ఖరారైన సంగతి తెలిసిందే.

ఫైనల్‌ తర్వాత స్వదేశానికి
తొలుత వన్డే సిరీస్‌ మొదలు కాగా.. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. శనివారం నాటి మూడో వన్డేలోనూ గెలుపొంది క్లీన్‌స్వీప్‌ చేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 టోర్నమెంట్‌లో శనివారం నాటి ఫైనల్‌ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశానికి చేరుకోనుంది.

వీవీఎస్‌  లక్ష్మణ్‌ కీలక నిర్ణయం
అనంతరం అక్టోబరు 6 నుంచి రెగ్యులర్‌ హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ మార్గదర్శనంలో భారత టీ20 జట్టు విండీస్‌తో సిరీస్‌ మొదలుపెడుతుంది. ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడల్లో టీమిండియాకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ తాత్కాలిక హెడ్‌కోచ్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీలంకతో సెమీ ఫైనల్‌ సందర్భంగా లక్ష్మణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

ఈ ముగ్గురు టాపార్డర్‌లో కుదురుకుంటే..
ఓపెనింగ్‌ బ్యాటర్లు అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, వైభవ్‌ సూర్యవంశీ.. ఇలా ముగ్గురినీ టాపార్డర్‌లో ఆడించాడు. ఓపెనర్లుగా వైభవ్‌, అభిషేక్‌ బరిలోకి దిగగా.. సంజూ వన్‌డౌన్‌లో వచ్చాడు. ఇదే కాంబినేషన్‌ను సొంతగడ్డపై వెస్టిండీస్‌తో సిరీస్‌లోనూ కొనసాగించాలని భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ అభిప్రాయపడ్డాడు.

ఒకవేళ ఈ ముగ్గురు టాపార్డర్‌లో కుదురుకుంటే.. వీరిలో ఒక్కరు మెరుగ్గా ఆడినా భారత జట్టు వరుస విజయాలు సాధించడం ఖాయమని కైఫ్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు..

గంభీర్‌ను కాదనైనా సరే శ్రేయస్‌ నిర్ణయం తీసుకోవాలి
‘‘విండీస్‌తో సిరీస్‌కు వీవీఎస్‌ కోచ్‌గా ఉండడు. అయితే కెప్టెన్‌ మాత్రం శ్రేయస్‌ అయ్యరే కదా!.. టాపార్డర్‌ విషయంలో శ్రేయస్‌ గట్టి నిర్ణయం తీసుకోవాలి. అభిషేక్‌, వైభవ్‌, సంజూలను తుదిజట్టులో ఆడించాలి.

వాళ్లు ముగ్గురూ గనుక టాపార్డర్‌లో కుదురుకుని.. ఈ కాంబినేషన్‌ వర్కౌట్‌ అయిందంటే అద్భుతమైన ఫలితాలు రాబట్టవచ్చు. అయితే, ఇక్కడ కోచ్‌ (గంభీర్‌)తో సమస్య రావొచ్చు. అయినా సరే శ్రేయస్‌ ఒప్పించగలగాలి. ఆ ముగ్గురిలో ఒక్కరు బ్యాట్‌ ఝులిపించినా టీమిండియా ఆరోజు తప్పక విజయం సాధిస్తుంది.

వన్‌డౌన్‌లోనైనా వైభవ్‌
వైభవ్‌ను పక్కన పెట్టడం ఏ రకంగానూ మంచిది కాదు. అతడిని ప్రపంచకప్‌ టోర్నీకి సిద్ధం చేయాలంటే వరుస అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. లెఫ్ట్‌- రైట్‌ కాంబినేషన్‌ కోసం అభిషేక్‌- సంజూను ఓపెనర్లుగా కొనసాగిస్తే వైభవ్‌ను వన్‌డౌన్‌లోనైనా ఆడించాలి’’ అని కైఫ్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన సంజూకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుందని ఇటీవల గంభీర్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాబట్టి యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ మరికొన్నాళ్లు వేచి చూడక తప్పదని కుండబద్దలు కొట్టాడు గంభీర్‌.

చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా యువ సంచలనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement