
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma) పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ.. 11.20 సగటుతో కేవలం 56 పరుగులు మాత్రమే చేశాడు.
అతడి ఇన్నింగ్స్‌లలో 18 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో రోహిత్ శర్మపై భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ కారణంగానే ముంబై ఇండియన్స్ టాప్‌లో నిలవలేకపోయిందని ఆమె అభిఫ్రాయపడింది. ముంబై ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి.. నాలుగు ఓటములు, రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది.
"ఏ ప్లేయరైనా ఫామ్ లేకపోవడం పెద్ద నేరమేమి కాదు. ప్రతీ ఒక్కరి కెరీర్‌లో ఎత్తు పల్లాలు ఉంటాయి. అయితే రోహిత్ ఫామ్‌లో లేకపోవడంతోనే ముంబై ఇండియన్స్ ఈ సారి కూడా టాప్-4లో కొనసాగలేకపోతుంది. రోహిత్ ఓపెనర్‌గా రాణించడంలో విఫలమవుతున్నాడు.
కాబట్టి అతడిని దిగువన బ్యాటింగ్‌కు పంపితే జట్టుకు ప్రయోజనం చేకూరే అవకాశముంది. ముంబై చాలా అప్షన్స్ ఉన్నాయి. రోహిత్ స్ధానంలో విల్ జాక్స్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లను ప్రయత్నించవచ్చు. రోహిత్ శర్మ ఎంతటి గొప్ప ఆటగాడు మనందరికి తెలుసు. ఈ ఏడాది సీజన్‌లో అతడికి మంచి ఆరంభం దక్కలేదు.
సహజంగా ఐపీఎల్‌లోనైనా, వరల్డ్‌కప్‌లోనైనా మన స్టార్ బ్యాటర్లు ఫామ్‌లో ఉండాలని కోరుకుంటాము. కొంతమంది వెంటనే తమ ఫామ్‌ను అందుకుని తిరిగి గాడిలో పడతారు. మరి కొంత మంది కాస్త ఆలస్యంగా తమ రిథమ్‌ను అందుకుంటారు. అంతమాత్రన వారు అత్యుత్తమ బ్యాటర్లు కాదని ఆర్ధం కాదని" పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చోప్రా పేర్కొన్నారు.
చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన గుంటూరు కుర్రాడు.. తొలి సీఎస్‌కే ప్లేయర్‌గా