నెదర్లాండ్స్‌కు షాకిచ్చిన మొరాకో | Morocco stun Netherlands on penalties to reach World Cup last 16 | Sakshi
Sakshi News home page

నెదర్లాండ్స్‌కు షాకిచ్చిన మొరాకో

Jun 30 2026 1:02 PM | Updated on Jun 30 2026 1:12 PM

Morocco stun Netherlands on penalties to reach World Cup last 16

ఫిఫా వరల్డ్‌కప్‌ 2026 రౌండ్‌ ఆఫ్‌ 32 చేరేసరికి మరింత రసవత్తరంగా మారింది. ఈ దశలో భాగంగా ఇవాళ జరిగిన నాలుగు మ్యాచ్‌లు చివరి నిమిషాల వరకు తీవ్ర ఉత్కంఠ రేపాయి. సౌతాఫ్రికాపై కెనడా 92వ నిమిషంలో గోల్‌ చేసి విజయం సాధించగా.. జపాన్‌పై బ్రెజిల్‌ 96వ నిమిషంలో మ్యాచ్‌ విన్నింగ్‌ గోల్‌ సాధించి రౌండ్‌ ఆఫ్‌ 16కి చేరింది.

మరో మ్యాచ్‌లో జర్మనీపై పరాగ్వే పెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించగా.. ఇంకో మ్యాచ్‌లో మొరాకో సైతం నెదర్లాండ్స్‌కు అదే తరహాలో షాకిచ్చింది. నిర్ణీత సమయం, అదనపు సమయంలో ఇరు జట్లు తలో గోల్‌ చేసి సమంగా నిలువగా.. పెనాల్టీ షూటౌట్‌లో మొరాకో పటిష్టమైన నెదర్లాండ్స్‌ను 3-2తో ఓడించి ప్రీక్వార్టర్ ఫైనల్ (రౌండ్ ఆఫ్-16)కు అర్హత సాధించింది.

పెనాల్టీ షూటౌట్‌లోనూ నాలుగు రౌండ్లు ముగిసే సరికి స్కోరు 2-2తో సమంగా ఉన్నప్పటికీ.. కీలక సమయంలో మొరాకో గోల్‌కీపర్ యాస్సిన్‌ బౌనో నెదర్లాండ్స్ ఆటగాడు క్రిసెన్సియో సమ్మర్‌విల్లే పెనాల్టీని అద్భుతంగా అడ్డుకున్నాడు. 

అనంతరం ఇస్మాయిల్‌ సైబారి తన కిక్‌ను గోల్‌గా మలిచి మొరాకోకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. గోల్ సాధించిన వెంటనే సైబారి ఆనందంతో జెర్సీ విప్పి సంబరాలు చేసుకోగా, సహచర ఆటగాళ్లు అతడిని చుట్టుముట్టి సంబరాల్లో మునిగిపోయారు.

ఈ మ్యాచ్‌లో తొలుత ఆధిక్యం నెదర్లాండ్స్‌కే లభించింది. 72వ నిమిషంలో కోడి గాక్పో గోల్ చేసి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ గోల్‌కు సమ్మర్‌విల్లే అసిస్ట్ చేశాడు. అయితే చివరి క్షణాల్లో మొరాకో పోరాటం ఫలించింది. 

ఇంజరీ టైమ్ (91వ నిమిషం)లో ఇస్సా డియోప్‌ హెడ్డర్‌తో గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. అదనపు 30 నిమిషాల్లో ఇరు జట్లు గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు చేరుకుంది.

ఈ పరాజయంతో నెదర్లాండ్స్‌కు మరో అపవాదు కూడా ఎదురైంది. గత 11 ప్రపంచకప్‌లలో కనీసం రౌండ్ ఆఫ్-16కు చేరిన డచ్ జట్టు, ఊహించని విధంగా ఈసారి రౌండ్‌ ఆఫ్‌-32లోనే నిష్క్రమించింది.

మరోవైపు, గత ప్రపంచకప్‌లో సెమీఫైనల్ వరకు చేరి చరిత్ర సృష్టించిన మొరాకో, ఈసారి కూడా అదే జోరును కొనసాగిస్తోంది. రౌండ్ ఆఫ్-16లో ఆ జట్టు కెనడాతో తలపడనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement