విజయంతో ముగించిన భారత్‌ | Mens FIH Hockey Pro League: India end campaign with 4-3 win over Belgium | Sakshi
Sakshi News home page

విజయంతో ముగించిన భారత్‌

Jun 23 2025 1:19 AM | Updated on Jun 23 2025 1:19 AM

Mens FIH Hockey Pro League: India end campaign with 4-3 win over Belgium

అంతర్జాతీయ హాకీ సమాఖ్య 2024–2025 ప్రొ లీగ్‌ను భారత పురుషుల జట్టు విజయంతో ముగించింది. యూరోపియన్‌ చివరి అంచె లీగ్‌లో భాగంగా ఆదివారం ఆంట్‌వర్ప్‌లో ఆతిథ్య బెల్జియం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4–3 గోల్స్‌ తేడాతో గెలుపొందింది. యూరోపియన్‌ అంచెలో భారత్‌కు దక్కిన ఏకైక విజయం ఇదే కావడం గమనార్హం. యూరోపియన్‌ అంచెలో భారత్‌ వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి, చివరి మ్యాచ్‌లో నెగ్గి ఊపిరి పీల్చుకుంది.

ఈ మ్యాచ్‌లో భారత్‌ తరఫున సుఖ్‌జీత్‌ సింగ్‌ (21వ, 35వ నిమిషంలో) రెండు గోల్స్‌ చేయగా... అమిత్‌ రోహిదాస్‌ (36వ నిమిషంలో), కెప్టేన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (59వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు. బెల్జియం జట్టు తరఫున స్లూవర్‌ (8వ నిమిషంలో), స్టాక్‌బ్రోయెక్స్‌ (34వ నిమిషంలో), హుగో  (41వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు.

మొత్తం తొమ్మిది జట్ల మధ్య జరుగుతున్న ప్రొ లీగ్‌లో భారత జట్టు తమ 16 మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. 6 మ్యాచ్‌ల్లో గెలిచి, 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన భారత్‌ 18 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు భారత మహిళల జట్టు వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది. బెల్జియంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 0–2తో ఓడిపోయింది. 

Advertisement
 
Advertisement
Advertisement