రాజస్తాన్‌తో రంజీ మ్యాచ్ ‘డ్రా’
రాణించిన రోహిత్ రాయుడు
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’లో హైదరాబాద్, రాజస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. సొంతగడ్డపై జరిగిన ఈ పోరులో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ద్వారా హైదరాబాద్ 3 పాయింట్లు తమ ఖాతాలో వేసుకోగా, రాజస్తాన్‌కు ఒక పాయింట్ దక్కింది. మంగళవారం 198/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ 78 ఓవర్లలో 244/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. క్రితం రోజు బ్యాటర్లలో తనయ్ త్యాగరాజన్ (4) కేవలం పరుగు మాత్రమే జతచేసి నిష్క్రమించాడు.
రోహిత్ రాయడు (42; 1 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు కుదురుగా ఆడాడు. టెయిలెండర్ అనికేత్ రెడ్డి (21 నాటౌట్, 2 ఫోర్లు)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 31 పరుగులు జోడించాక రోహిత్‌ను మహిపాల్ అవుట్ చేశాడు. పున్నయ్య (0 నాటౌట్) క్రీజులోకి రాగా... మరో పది బంతులకే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ 95 పరుగుల ఆధిక్యం కలుపుకొని ప్రత్యర్థి ముందు 340 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్ మ్యాచ్ ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో 3 వికెట్లకు 207 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు సచిన్ యాదవ్ (44; 5 ఫోర్లు, 1 సిక్స్), సల్మాన్ ఖాన్ (79; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మహిపాల్ లొమ్రోర్ (40; 3 ఫోర్లు) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 2, అనికేత్ ఒక వికెట్ తీశారు.
ఈ సీజన్‌లో 4 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ ఒకటి గెలిచి, మిగతా మూడు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. ‘డి’ పాయింట్ల పట్టికలో ముంబై (17), జమ్మూ కశ్మీర్ (14) తర్వాత హైదరాబాద్ 13 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ నెల 16 నుంచి జమ్మూ వేదికపై జరిగే తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్... జమ్మూ కశ్మీర్‌తో తలపడుతుంది.


