IND vs ENG: నువ్వసలు ఏం చేస్తున్నావు?.. తప్పు నీదే! | Kya Kar Raha: Abhishek On Ishan Run Out Gavaskar Puts Clear Blame | Sakshi
Sakshi News home page

Abhishek-Ishan: నువ్వసలు ఏం చేస్తున్నావు?.. తప్పు నీదే!

Jul 2 2026 11:12 AM | Updated on Jul 2 2026 11:22 AM

Kya Kar Raha: Abhishek On Ishan Run Out Gavaskar Puts Clear Blame

PC: Jiostar X

ఇంగ్లండ్‌తో తొలి టీ20లో టీమిండియా స్టార్‌ ఇషాన్‌ కిషన్‌ పూర్తిగా విఫలమయ్యాడు. తన తొందరపాటు చర్యతో మూల్యం చెల్లించుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ఇషాన్‌ కిషన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అసలేం జరిగిందంటే.. ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా టీమిండియా బుధవారం తొలి టీ20 ఆడింది. చెస్టర్‌ లీ స్ట్రీట్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లలో సంజూ శాంసన్‌ (1) వైఫల్యాల పరంపర కొనసాగించగా.. అభిషేక్‌ శర్మ మెరుపు అర్ధ శతకం (24 బంతుల్లో 59) సాధించాడు.

నువ్వసలు ఏం చేస్తున్నావు?
ఇక వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్‌ కిషన్‌ రెండు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో సకీబ్‌ మహ్మూద్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి విఫలమైన ఇషాన్‌.. అక్కడ పరుగుకు ఆస్కారం లేకున్నా సింగిల్‌ కోసం పరిగెత్తాడు.

మరో ఎండ్‌లో ఉన్న అభిషేక్‌ శర్మ బంతిని గమనించి సింగిల్‌కు అవకాశం లేదని అక్కడే ఉండిపోయాడు. ‘‘నువ్వసలు ఏం చేస్తున్నావు?’’ అంటూ ఒకింత అసహనంతో ఇషాన్‌ను హెచ్చరించాడు కూడా!.. దీంతో ఇషాన్‌ క్రీజులోకి చేరుకునేందుకు డైవ్‌ కూడా చేశాడు.

కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫీల్డర్‌ నుంచి బంతిని అందుకున్న ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ వికెట్లను గిరాటేయడంతో ఇషాన్‌ కిషన్‌ పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో ఇషాన్‌- అభిషేక్‌లలో తప్పెవరిది అన్న చర్చ జరుగుతుండగా.. సునిల్‌ గావస్కర్‌ అభిషేక్‌కు మద్దతుగా నిలిచాడు.

ఇందుకు పూర్తి బాధ్యుడు అతడే
‘‘వీలైనంత త్వరగా క్రీజులోకి చేరుకోవాల్సింది. ముఖ్యంగా ఈ ఫార్మాట్లో అన్నీ క్షణాల్లో జరిగిపోతాయి. ఇందులో అభిషేక్‌ శర్మ తప్పేమీ లేదు. ఇది ఇషాన్‌ కిషన్‌ స్వీయ తప్పిదం. ఇందుకు పూర్తి బాధ్యుడు అతడే’’ అని గావస్కర్‌ తీవ్ర స్థాయిలో ఇషాన్‌ను విమర్శించాడు.

కాగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ బుధవారమే నంబర్‌వన్‌ స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు రెండో ర్యాంక్‌లో ఉన్న ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. ఒక స్థానం మెరుగుపర్చుకొని 876 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు నంబర్‌వన్‌గా ఉన్న ఇషాన్‌ సహచరుడు అభిషేక్‌ శర్మ (869) రెండో స్థానానికి పడిపోయాడు.

గంటల్లోనే హీరో నుంచి జీరోగా..
అయితే, నంబర్‌ వన్‌గా ఎదిగిన కొన్ని గంటల్లోనే ఇషాన్‌ కిషన్‌ ఇలా ‘జీరో’ స్కోరుతో పెవిలియన్‌ చేరడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌- టీమిండియా మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైపోయింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (47 బంతుల్లో 68), శివం దూబే (21 బంతుల్లో 42 నాటౌట్‌) రాణించారు.

చదవండి: కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన శ్రేయస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement