రావల్పిండి వేదికగా పాకిస్తాన్తో జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ క్లీన్ స్వీప్ నుంచి శ్రీలంక తప్పించుకుంది. ఈ ఆఖరి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్కు లంక పేసర్లు ప్రారంభంలోనే షాకిచ్చారు. ఓపెనర్లు ఫకర్ జమాన్ (12), మాజ్ సదాకత్ (0) వరుస బంతుల్లో పెవిలియన్కు చేరడంతో పాక్ 34 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ సమయంలో కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్ (47 బంతుల్లో 3 సిక్సర్లు, 7 ఫోర్లతో 76 పరుగులు) మరోసారి అద్భుత ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. అతడితో పాటు చివరి ఓవర్లలో అరఫాత్ మిన్హాస్ (20 బంతుల్లో 34 నాటౌట్) ధాటిగా ఆడటంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగలిగింది. లంక బౌలర్లలో దాసున్ శానక 3 వికెట్లతో పాక్ను దెబ్బతీయగా.. నువాన్ తుషార, ఈషాన్ మలింగ తలా 2 వికెట్లు తీశారు.
మెండిస్ కెప్టెన్ ఇన్నింగ్స్
అనంతరం 169 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 17.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఊదిపడేసింది. లంక కెప్టెన్ కుశాల్ మెండిస్ విధ్వంసం సృష్టించాడు. మెండిస్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 48 బంతుల్లోనే 4 సిక్సర్లు, 9 ఫోర్లతో అజేయంగా 87 పరుగులు చేసి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. సినెత్ జయవర్ధనే(38), కమిందు మెండిస్(27 బంతుల్లో 40 నాటౌట్) దూకుడుగా ఆడారు. అయితే తొలి రెండు టీ20ల్లో విజయం సాధించడంతో పాక్ 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది.
చదవండి: యువరాజ్ ఫెయిల్.. వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి


