చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా | KL Rahul Creates History, Becomes First Player In 96 Years To Achieve Unique Feat | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Jun 7 2026 5:11 PM | Updated on Jun 7 2026 5:56 PM

KL Rahul Creates History, Becomes First Player In 96 Years To Achieve Unique Feat

ముల్లాన్‌పూర్ వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.  ఐపీఎల్‌లో దంచికొట్టిన రాహుల్‌... టెస్టు ఫార్మాట్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో భాగం కానీ ఈ మ్యాచ్‌లో భారత్‌కు చెప్పుకోదగ్గ ఆరంభం లభించలేదు.

చక్కటి షాట్‌లతో మంచి టచ్‌లో కనిపించిన యశస్వి జైస్వాల్‌ త్వరగానే అవుటవడంతో... అఫ్గాన్‌ శిబిరంలో ఆనందం కనిపించింది. వనడౌన్‌ బ్యాటర్‌ సుదర్శన్‌ సాయంతో రాహుల్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చితూచి ఆడిన ఈ జంట ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లింది. మంచి బంతులను వదిలేసిన ఈ జోడీ... గతి తప్పిన బంతులపై విరుచుకుపడింది.

దీంతో స్కోరుబోర్డు సాఫీగా సాగగా... అఫ్గాన్‌ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ జంటను విడదీయలేకపోయారు. అనుభవరాహిత్యం అఫ్గాన్‌ జట్టుకు ప్రతిబంధకంగా మారింది. 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్‌ బ్యాట్‌ను తాకిన బంతి... కీపర్‌ చేతిలో పడింది. అయితే అంపైర్‌ ఇది గుర్తించకపోగా... అఫ్గాన్‌ రివ్యూ కోరలేదు. 

తర్వాత రీప్లేలో అది స్పష్టంగా అవుట్‌ అని కనిపించింది. దీంతో బతికిపోయిన రాహుల్‌... టెస్టు ఫార్మాట్‌లో 12వ సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. రాహుల్ 165 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో స‌రిగ్గా 100 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఈ క్ర‌మంలో రాహుల్ ఓ అరుదైన ఘ‌న‌తను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

చ‌రిత్ర సృష్టించిన రాహుల్‌
రాహుల్ సరిగ్గా 100 పరుగుల వద్దే అవుట్ కావడం రాహుల్ కెరీర్‌లో ఇది మూడోసారి. దీంతో  టెస్టుల్లో అత్యధిక సార్లు ఖచ్చితంగా 100 పరుగుల వద్ద అవుట్ అయిన భారత బ్యాటర్‌గా రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో  సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు తమ కెరీర్‌లో రెండేసి సార్లు  ఇలా వంద పరుగుల వద్ద అవుట్ అయ్యారు. 

ఇప్పుడు రాహుల్ వారిని అధిగ‌మించాడు. అంతేకాకుండా రాహుల్ త‌న టెస్ట్ కెరీర్‌లో చేసిన చివ‌రి మూడు సెంచ‌రీలు కూడా ఇలా వంద ప‌రుగులు వ‌ద్దే ముగిశాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వరుసగా మూడు సెంచరీలను ఇలా 'ఖచ్చితంగా 100' వద్దే ముగించిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement