జ్యోతి యర్రాజీకి స్వర్ణ పతకం | Jyoti Yarraji wins gold medal | Sakshi
Sakshi News home page

జ్యోతి యర్రాజీకి స్వర్ణ పతకం

Jun 8 2025 1:49 AM | Updated on Jun 8 2025 1:49 AM

Jyoti Yarraji wins gold medal

తైపీ సిటీ: తైవాన్‌ ఓపెన్‌ అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ మీట్‌లో తొలి రోజు భారత అథ్లెట్లు ఆరు స్వర్ణ పతకాలతో అదరగొట్టారు. తైపీ సిటీలో శనివారం జరిగిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జ్యోతి యర్రాజీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల కొరియాలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలిచిన ఈ వైజాగ్‌ అమ్మాయి అదే జోరును తైవాన్‌ మీట్‌లో పునరావృతం చేసింది. 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసును 25 ఏళ్ల జ్యోతి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 12.99 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. 

పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో భారత రన్నర్‌ తేజస్‌ శిర్సే (13.52 సెకన్లు) స్వర్ణ పతకాన్ని హస్తగతం చేసుకున్నాడు. పురుషుల 4్ఠ100 మీటర్ల రిలేలో గురీందర్‌వీర్‌ సింగ్, అనిమేశ్‌ కుజుర్, మణికంఠ హోబ్లిధర్, అమ్లాన్‌ బొర్గోహైన్‌లతో కూడిన భారత బృందం (38.75 సెకన్లు) బంగారు పతకాన్ని నెగ్గింది. 

మహిళల 4x100 మీటర్ల రిలేలో తెలంగాణ అమ్మాయి నిత్య గంధే, సుదీక్ష, స్నేహ, అభినయ సభ్యులుగా ఉన్న భారత జట్టు (44.06 సెకన్లు) స్వర్ణ పతకం దక్కించుకుంది. పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో అబ్దుల్లా అబూబకర్‌ (16.21 మీటర్లు), మహిళల 1500 మీటర్ల విభాగంలో పూజ (4ని:11.63 సెకన్లు) బంగారు పతకాలు గెలిచారు.   

Advertisement
 
Advertisement
Advertisement