breaking news
Taiwan Open
-
జ్యోతి యర్రాజీకి స్వర్ణ పతకం
తైపీ సిటీ: తైవాన్ ఓపెన్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో తొలి రోజు భారత అథ్లెట్లు ఆరు స్వర్ణ పతకాలతో అదరగొట్టారు. తైపీ సిటీలో శనివారం జరిగిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల కొరియాలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలిచిన ఈ వైజాగ్ అమ్మాయి అదే జోరును తైవాన్ మీట్లో పునరావృతం చేసింది. 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 25 ఏళ్ల జ్యోతి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 12.99 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో భారత రన్నర్ తేజస్ శిర్సే (13.52 సెకన్లు) స్వర్ణ పతకాన్ని హస్తగతం చేసుకున్నాడు. పురుషుల 4్ఠ100 మీటర్ల రిలేలో గురీందర్వీర్ సింగ్, అనిమేశ్ కుజుర్, మణికంఠ హోబ్లిధర్, అమ్లాన్ బొర్గోహైన్లతో కూడిన భారత బృందం (38.75 సెకన్లు) బంగారు పతకాన్ని నెగ్గింది. మహిళల 4x100 మీటర్ల రిలేలో తెలంగాణ అమ్మాయి నిత్య గంధే, సుదీక్ష, స్నేహ, అభినయ సభ్యులుగా ఉన్న భారత జట్టు (44.06 సెకన్లు) స్వర్ణ పతకం దక్కించుకుంది. పురుషుల ట్రిపుల్ జంప్‌లో అబ్దుల్లా అబూబకర్ (16.21 మీటర్లు), మహిళల 1500 మీటర్ల విభాగంలో పూజ (4ని:11.63 సెకన్లు) బంగారు పతకాలు గెలిచారు. -
తైవాన్ ఓపెన్ సెమీస్‌లో వీనస్
కావ్సియాంగ్:టాప్ సీడ్ వీనస్ విలియమ్స్ తైవాన్ ఓపెన్ టోర్నమెంట్ లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో వీనస్ 7-5, 6-2 తేడాతో అనాస్తాసిజా సెవాస్తోవాను ఓడించి సెమీస్ కు చేరింది. ఈ మ్యాచ్ లో 10 బ్రేక్ పాయింట్లకు గాను ఏడు పాయింట్లను వీనస్ గెలిచి సెవాస్తోవాపై తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఇదిలా ఉండగా మరో మ్యాచ్ లో మూడో సీడ్ పుతిన్త్ సేవా సెమీస్ కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో పుతిన్త్ సేవా తొలి సెట్ ను 6-3 తేడాతో చేజిక్కించుకున్న అనంతరం స్టెఫనీ వోయిజిల్ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో పుతిన్త్ సేవా సెమీస్ కు చేరి వీనస్ తో అమీతుమీ తేల్చుకోనుంది.