బుమ్రాకు పోటీ.. కొత్త నంబర్‌ వన్‌ | Jasprit Bumrah Challenged By Another Pacer, ICC Declares New No. 1 In Rankings | Sakshi
Sakshi News home page

బుమ్రాకు పోటీ.. కొత్త నంబర్‌ వన్‌

Jun 24 2026 5:37 PM | Updated on Jun 24 2026 7:21 PM

Jasprit Bumrah Challenged By Another Pacer, ICC Declares New No. 1 In Rankings

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వారాంత ర్యాంకింగ్స్‌లో ఆసక్తికర మార్పులు చోటు సుకున్నాయి. ఇంగ్లండ్-న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌, భారత్-ఆఫ్ఘనిస్తాన్ వన్డేలు, శ్రీలంక-వెస్టిండీస్ టీ20 సిరీస్‌ల ప్రదర్శనల ఆధారంగా పలువురు ఆటగాళ్ల ర్యాంకులు మారాయి. ముఖ్యంగా టెస్టు బౌలర్ల విభాగంలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రాకు గట్టి సవాల్ ఎదురైంది.

న్యూజిలాండ్ ఫాస్ట్‌ బౌలర్‌ మ్యాట్‌ హెన్రీ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టి బుమ్రాతో కలిసి సంయుక్త నంబర్‌-1 స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇద్దరూ ప్రస్తుతం 870 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. గత వారం వరకు అగ్రస్థానంలో ఒంటరిగా ఉన్న బుమ్రాకు ఇప్పుడు హెన్రీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. హెన్రీ ఏకంగా 6 స్థానాలు ఎగబాకి టాప్‌ ప్లేస్‌కు దూసుకొచ్చాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో హెన్రీ అసాధారణ ప్రతిభ కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి మొత్తం 11 వికెట్లతో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. అతడి ప్రదర్శనతో న్యూజిలాండ్ సిరీస్‌ను 1-1తో సమం చేసుకోగలిగింది. ఇంగ్లండ్‌పై ఒక టెస్టులో న్యూజిలాండ్ బౌలర్ నమోదు చేసిన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కూడా ఇవే.

మరోవైపు టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో కూడా మార్పు చోటు చేసుకుంది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌ మళ్లీ నంబర్‌-1 స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇటీవల అగ్రస్థానాన్ని దక్కించుకున్న హ్యారీ బ్రూక్‌ రెండో స్థానానికి పడిపోయాడు. 

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రూట్ చేసిన 77 పరుగుల ఇన్నింగ్స్ అతడిని తిరిగి అగ్రస్థానానికి చేర్చింది. ప్రస్తుతం రూట్ 871 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, హ్యారీ బ్రూక్ 866 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

వన్డే ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ భారత్‌ తరఫున అత్యుత్తమ ర్యాంక్‌ కలిగిన బ్యాటర్‌గా అవతరించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 238 పరుగులు చేసిన అతడు.. మూడు స్థానాలు మెరుగుపర్చుకొని 791 పాయింట్లతో  రెండో స్థానానికి ఎగబాకాడు. 815 పాయింట్లు కలిగిన డారిల్‌ మిచెల్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

అదే సమయంలో మూడు సంవత్సరాల తర్వాత వన్డేల్లోకి తిరిగి వచ్చిన ఇషాన్‌ కిషన్‌ ఏకంగా 21 స్థానాలు మెరుగుపరుచుకుని 43వ ర్యాంక్‌కు చేరుకోగా, యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ ఏకంగా 84 స్థానాలు ఎగబాకి 71వ స్థానంలో నిలిచాడు.

ఇతర ముఖ్య మార్పుల్లో న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్‌ 13 స్థానాలు మెరుగుపరుచుకుని 40వ ర్యాంక్‌కు (టెస్ట్‌) చేరుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాట్‌ రెన్షా టీ20 బ్యాటర్ల జాబితాలో 70 స్థానాలు ఎగబాకాడు. భారత పేసర్ అర్షదీప్‌ సింగ్‌ 16 స్థానాలు మెరుగుపరుచుకుని 22వ ర్యాంక్‌కు (వన్డేల్లో) చేరుకున్నాడు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement